తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకుంటున్నారు. ఇక తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికి తోచిన సహాయాన్ని వారు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇక మరో టీడీపీ నేత, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో కోటి రూపాయలు వరద బాధితుల కోసం ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడగా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలు.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే తన వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రూ.కోటి ప్రకటించారు. ఇందులో తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
50 ఏళ్ల క్రితం తన తండ్రి తన నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉందని.. 50 ఏళ్లుగా తన నట ప్రస్థానం కొససాగుతూనే ఉందని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోందని.. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు.. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళంగా అందిస్తున్నానని చెప్పారు. అతి త్వరలోనే రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు
బాలకృష్ణ పేర్కొన్నారు.
మరోవైపు.. వరద బాధితులకు ఆదుకునేందుకు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి సహాయం చేసేందుకు రూ. కోటి సాయం అందించారు. ఈ రూ. కోటి చెక్కును తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందజేశారు. ఇక వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకునే వారి కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 7906796105 నంబర్‌కు ఫోన్ చేయాలని.. దానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించింది.