ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారుతున్నా అప్పులు మాత్రం తగ్గడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు మయం చేసిందని గతంలో విపక్షంగా ఉన్న టీడీపీ విమర్శించింది. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించింది. ఇక తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని.. ఆ సంపదతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని టీడీపీ పదే పదే చెప్తూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాట ఎన్నికల సమయంలో అనేకసార్లు చెప్పారు. ఇక 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మునుపెన్నడూ లేని రీతిలో కూటమి ఏకంగా164 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ 151 నుంచి 11 సీట్లకు పరిమితమైంది.
అయితే ఇప్పుడీ అప్పుల ప్రస్తావన ఎందుకంటే నాలుగు నెలల కాలంలో ఏపీ అప్పులు 43 వేల కోట్లు పెరిగాయి. ప్రధాన గణాంకాధికారి కార్యాలయం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఏప్రిల్ నుంచి జులై వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.43, 058 కోట్లు అప్పులు చేసిందని నివేదికలో వెల్లడించారు. ఈ నాలుగు నెలల కాలంలో ఏపీ ద్రవ్యలోటు, ఆదాయ లోటు కూడా గణనీయంగా పెరిగింది. ఈ నాలుగు నెలల కాలంలో పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు రూ.44,822 కోట్లు చేరాయి. వీటిలో కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ వంటివి కలిపి 41 వేల కోట్ల వరకూ ఉంది. ఈ నాలుగు నెలల్లో ప్రభుత్వానికి రూ.44,822 కోట్ల ఆదాయం వస్తే.. ఖర్చులు మాత్రం రూ.87282 కోట్లు ఉన్నాయి.
అయితే 44 వేల కోట్లు రాష్ట్ర అవసరాలకు సరిపోకపోవటంతో మరో రూ.43,058 కోట్లను ప్రభుత్వం రుణాల ద్వారా సమకుర్చుకున్నారు. అంటే నెలకు దాదాపుగా 11 వేల కోట్ల చొప్పున అప్పులు చేశారు.ఈ నేపథ్యంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు, శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాయి.
అయితే ఈ అప్పుల లెక్కలు ఏప్రిల్ నుంచి జులై వరకూ ఉన్నవి కాగా.. జూన్‌లో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు నెలల కాలాన్నే టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనగా గుర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ విమర్శలకు టీడీపీ శ్రేణులు కూడా ఇదే రీతిలో కౌంటర్లు ఇస్తున్నాయి. ఆ 43 వేలకోట్ల అప్పుల్లో ఏప్రిల్ ,మే నెలల్లో చేసినవే రూ.27000 కోట్లు ఉన్నాయని.. అవి కనిపించడం లేదా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
ఇక అధికారంలోకి వచ్చాక టీడీపీ కూటమి ప్రభుత్వం పింఛన్ల పెంపు పథకాన్ని మాత్రమే అమలు చేసింది. ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ వంటివి అమలు చేసినప్పటికీ.. ఆర్థికపరమైన పథకాల కిందకు రావు. ఇక పింఛన్ల విషయంలోనూ జూన్ నెలలో ఏడు వేల చొప్పున పింఛన్ పంపిణీ చేశారు. దీంతో భారీగా డబ్బులు కావాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో ఒక్క పథకం అమలు చేస్తేనే పరిస్థితి ఇలా ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన అన్ని పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటనే ఆందోళనలు కూడా తలెత్తుతున్నాయి.