వరదలకు విజయవాడ, కృష్ణా జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తెలిపారు. కూటమి నేతలు అందరూ నిరంతరం ప్రజల కష్టాలు తీర్చేందుకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని.. బాధితులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీ వైసీపీ అని విమర్శలు చేశారు. 72 గంటల పాటు సీఎం చంద్రబాబు ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు సహాయసహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయాలి కానీ... మాజీ ముఖ్యమంత్రి జగన్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రిటైనింగ్ వాల్ టీడీపీ ప్రభుత్వం కట్టిందని సిగ్గు లేకుండా జగన్, వైసీపీ నేతలు చెబుతున్నారని అన్నారు. ఫేజ్ 1 టీడీపీ హయాంలో పూర్తి చేశామని తెలిపారు. ఐదేళ్లలో ఒక్క మీటర్ దూరం కూడా వాల్ని వైసీపీ కట్టలేదని చెప్పారు. వరదల్లో ప్రజలకి సహాయం చేయకుండా సిగ్గులేని మాటలు జగన్, వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బుడమేరుపై విచ్చలవిడిగా ఆక్రమణలు చేసిన వైసీపీ నేతలు వరదలకు కారకులు అయ్యారని చెప్పారు. జగన్ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే అక్కడ ఒకరోజు ఉన్నావా అని ప్రశ్నించారు. పరదాలు కట్టుకుని, ప్రజలకి కనిపించకుండా వరదలు అయిపోయాక జగన్ తిరిగారని ఆరోపణలు చేశారు. గోదావరి వరదలు వస్తే 19 రోజుల తర్వాత జగన్ వెళ్లారని గుర్తుచేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకు ఐదేళ్లు పోలీసులను వాడారని విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వంలో పోలీసులను ప్రజల కోసం, వారి భద్రత కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో ఐదేళ్లలో ఏ నీటి ప్రాజెక్టుల గేట్లనైనా జగన్, వైసీపీ నేతలు పరిశీలించారా...? అని ప్రశ్నించారు. ఎక్కడ ఎవరు చనిపోతారో అని... శవం కోసం జగన్ వెతుక్కుంటున్నారని విమర్శించారు. అబద్దాన్ని నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తి జగన్ అని ఆరోపించారు. ఆయన తర్వాత స్థానం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిదని బీదా రవిచంద్ర ఎద్దేవా చేశారు.