బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి తగు ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని తెలిపారు. ఇందుకు మనకున్న చట్ట నిబంధనలు సరిపోకపోతే, అవసరమైతే కొత్త చట్టం తెస్తామన్నారు. రేపు ఉదయానికల్లా విజయవాడ నగరంలో ఎలాంటి వరద నీరు లేకుండా చేస్తామన్నారు. ఇంటింటి నష్టం అంచనా ప్రక్రియ అవసరమైతే ఇంకో రోజూ పొడిగిస్తామని తెలిపారు. ఎవరైనా ఇంట్లో లేకపోయినా.. వేరే ప్రాంతానికి వెళ్లినా వారు వచ్చాక కూడా నష్టం అంచనా నమోదు చేస్తామన్నారు. 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. బుడమేరకు గండిపడి వచ్చిన నీటికి పోయే దారి లేక ఇబ్బందులు తలెత్తాయన్నారు. రేపు, ఎల్లుండి కూడా అవసరమైన చోట ఆహారం అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.