ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలని.. కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలని సూచించారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేటలో ఈరోజు(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని షర్మిల ధైర్యం చెప్పారు. వరద బాధితులను పరామర్శించి, వస్త్రాలను షర్మిల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... విజయవాడలో వరద. బీభత్సం అందరం చూశామని అన్నారు. బుడమేరు ముంపుతో ఏడు లక్షల మంది ప్రభావితం అయ్యారని చెప్పారు. 50 మంది వరదలతో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అపారమైన ఆస్తి నష్టంతో ప్రజలు దెబ్బతిన్నారని అన్నారు. విజయవాడకు సమీపంలోనే రాజధాని అమరావతి ఉందని చెప్పారు. ఒక్క విజయవాడలో ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోందని షర్మిల ప్రశ్నించారు. రూ. 6, 888 కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. కేంద్ర బృందాలు ఏపీకి వచ్చి, చూసి పరిశీలించి వెళ్లాయని.. మరీ సాయం ఎందుకు చేయలేదని షర్మిల ప్రశ్నించారు.. ఏపీపై కేంద్ర ప్రభుత్వానికి అంత చిన్న చూపు ఎందుకని షర్మిల నిలదీశారు.