ప్రజలపై విద్వేషంతో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన జాతి ద్రోహం ఫలితమే బెజవాడ ముంపునకు కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వరదలపై 10రోజుల పాటు అహర్నిశలూ శ్రమించి ఓ పెద్ద యుద్ధమే చూశానని అన్నారు. ఓ దుర్మార్గుడు నిర్లక్ష్యం ఎంతమంది పాలిట శాపమో బుడమేరు ఉగ్రరూపమే ఓ పాఠమని ఆరోపించారు. బుడమేరులో ఈరోజు(మంగళవారం) సీఎం చంద్రబాబు సందర్శించారు. బాధితులను కలిసి వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బుడమేరుకు విజయవాడ నగరం వైపు పడిన 3 గండ్లను వైసీపీ ప్రభుత్వం ఎందుకు పూడ్చలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. బుడమేరు దాల్చిన ఉగ్రరూపంతో ఈ నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పులివాగు కూడా వచ్చి ఇక్కడే కలిసిందని తెలిపారు. ఆర్మీ కూడా చేతులెత్తేసే పరిస్థితుల్లో మంత్రి రామానాయుడు నేతృత్వంలోని బృందం అహర్నిశలు పనిచేసి బుడమేరు గండ్లు పూడ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు.