అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు భారీ వరద ముప్పు పొంచి ఉందని కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు మరో 72గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ఇవాళ సాయంత్రానికి 10లక్షల క్యూసెక్కులు వరదనీరు ధవలేశ్వరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే రేపటికల్లా 13లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీ నుంచి దిగువకు వదిలి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని మహేశ్ కుమార్ వెల్లడించారు. భారీగా వరదనీరు దిగువకు వచ్చే అవకాశం ఉండడంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. లంక ప్రాంతాల్లో 17చోట్ల గోదావరి పాయలు దాటేందుకు ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేశామని, ప్రజలను కాపాడేందుకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పడవలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు.