కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్‌కు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 45,000క్యూసెక్కుల వరదనీరు వచ్చిందని మంత్రి నిమ్మల తెలిపారు. ఫ్లడ్ మెనేజ్మెంట్ సరిగ్గా చేయడం వల్ల నష్ట తీవ్రతను తగ్గించగలిగామని పేర్కొన్నారు. ధవళేశ్వరం ప్రాజెక్టుకు ప్రస్తుతం 7లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, ఇవాళ(మంగళవారం) సాయంత్రానికి 10లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. సాయంత్రానికి మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉండడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. కొల్లేరు అవుట్ ఫ్లో పెంచడానికి అడ్డంకిగా ఉన్న కిక్కీసను తొలగించాలని అధికారులను ఆదేశించారు. వరదనీటితో రాయలసీమకు సంబంధించిన రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నింపి ప్రతిరోజూ నివేదిక అందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, ఈఏన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సహా పలువురు నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.