ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే యువతలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే వారిలో ఆయనంటే చాలా మందికి అభిమానం. చంద్రబాబు అరెస్ట్ సమయంలో జరిగిన నిరసనలు, మొన్న ఏపీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పక్క రాష్ట్రాల నుంచి యువత తరలివచ్చిన తీరు చూస్తేనే.. ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. ఇక అదే ఊపులో తిరుగులేని మెజారిటీతో చంద్రబాబును సీఎం చేసింది యువతరం. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపై తమ అభిమానం బయటపెట్టుకుంటోంది. తాజాగా ఏలూరు జిల్లా పర్యటనలో చంద్రబాబుపై తనకు ఉన్న అభిమానాన్ని ఓ యువతి బయటపెట్టింది. పాటపాడి తన అభిమాన నేతపై ఉన్న అభిమానాన్ని చూపించింది.
విషయంలోకి వస్తే వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రాంతాలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ క్రమంలోనే ఏలూరులో చంద్రబాబు పంట నష్టాన్ని పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువతి చంద్రబాబును ఉద్దేశిస్తూ పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు మీరన్నా, నారా లోకేష్ అన్నా చాలా అభిమానమని చంద్రబాబుకు చెప్పిన యువతి.. తాను ఓ పాట రాశానని పాడటానికి అనుమతి ఇవ్వాలని కోరింది. అలాగే లోకేష్ మీూద రెండు పాటలు, పుస్తకాలు కూడా రాసినట్లు చెప్పింది. తాను రాసిన పాటలో చరణాలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరింది. దీంతో నవ్వుతూనే అందుకు అంగీకరించారు చంద్రబాబు.
దీంతో చంద్రుడా.. మా చంద్రుడా నిరంతరం రావాలి అంటూ పాట అందుకుంది ఆ యువతి. విభజన సమస్యల దగ్గర నుంచి పెట్టుబడుల ఆకర్షణ వరకూ ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబును పొగుడుతూ యువతి పాటపాడింది. పాట పాడుతున్నంతసేపు.. చంద్రబాబు మురిసిపోతూ కనిపించారు. ఆ తర్వాత ఆ యువతికి నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే గతంలోనూ చంద్రబాబును పొగుడుతూ కొంత మంది మహిళలు పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
పోలవరం సందర్శనకు అప్పట్లో ప్రజలను బస్సుల్లో తీసుకువెళ్లేవారు. ఈ క్రమంలోనే పోలవరం పర్యటనకు వెళ్లిన కొంతమంది మహిళలు చంద్రబాబును పొగుడుతూ జయము జయము చంద్రన్న అంటూ పాటను పాడారు. ఆ పాట ఎంత వైరల్ అయ్యిందంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక సాక్షాత్తూ వైఎస్ జగన్.. అసెంబ్లీలో ఆ పాటను ప్లే చేసి మరీ చంద్రబాబుపై విమర్శలు చేశారు. అయితే ఏలూరులో యువతి పాడిన పాట.. అంతకుమించి ఉందంటూ టీడీపీ శ్రేణులు, కొంతమంది నెటిజనం అభిప్రాయపడుతున్నారు.