ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న వైసీపీ నేతలు, ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే రెండుపార్టీల నేతల మధ్యల మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బుధవారం గుంటూరు జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయనతో ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన జగన్.. టీడీపీ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందన్న వైఎస్ జగన్.. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని మరిచిపోవద్దని హెచ్చరించారు. రెడ్ బుక్ ఒకరికే సొంతం కాదన్న జగన్.. ఐదేళ్ల తర్వాత మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నేతలను ఇదే జైలుకు పంపుతామంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి, ప్రభుత్వం నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఇప్పటికే మంత్రులు నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వంటి నేతలు వైఎస్ జగన్‌ను కౌంటరిచ్చారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనుక వైసీపీ కుట్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదంటున్న వైఎస్ జగన్.. ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని భావిస్తే రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. తాను తిరువూరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. అప్పుడు ప్రజామోదం ఎవరికి ఉందో తెలిసిపోతుందంటూ సవాల్ విసిరారు.
"శాసనసభలో అన్ని విషయాలపైనా శ్వేతపత్రాలు విడుదల చేశాం. చర్చకు అవకాశం ఇచ్చాం. ఆరోజు పారిపోయాడు. ఈ రోజు నాలుగు పేపర్లు పట్టుకుని గుంటూరు జైలు ముందు నిలబడి.. అది చేయలేదు, ఇది చేయలేదంటున్నాడు. మా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తోంది. నిజంగా నువ్వు అనుకున్నట్లు మా ప్రభుత్వానికి, మా కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పుపట్ల అనుమానం ఉంటే.. తిరువూరు ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. పులివెందుల ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేయ్. నేను నా పార్టీ తరుఫున, నువ్వు నీ పార్టీ తరుఫున పోటీ చేయ్. ఎవరికి ప్రజల ఆమోదం ఉందో తెలిసిపోతుంది. ఇష్టానుసారం మాట్లాడితే.. చట్టపరిధిలో ఎవరినీ వదిలేది లేదు. వరద బాధితుల పరామర్శకు, కుటుంబసభ్యులు అనారోగ్యంతో ఉంటే చూడ్డానికి వెళ్లని వైఎస్ జగన్.. జైళ్లో ఉన్న నందిగం సురేష్‌ను చూడ్డానికి వెళ్లారంటేనే ఆయన ప్రాధాన్యం దేనికో అర్థమవుతోంది. " అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓ రేంజులో ఫైరయ్యారు.
అయితే అమరావతి ఉద్యమనేతగా ఉన్న కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ తొలిసారిగా సీటు ఇచ్చింది. తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అవకాశం కల్పించింది. కూటమి సునామీలో తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు వైఎస్ జగన్ పులివెందుల నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు.