ఏపీలోని మందుబాబులకు బిగ్ రిలీఫ్.. ఎందుకంటే ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే నూతన మద్యం విధానం రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం తొలిసారిగా భేటీ అయ్యింది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ భేటీ అయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో.. కొత్త మద్యం పాలసీపై చర్చించారు. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానాన్ని సమీక్షించారు. ఇక వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మద్యం విధానాలను సైతం మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేయనుంది. అలాగే ఆరు రాష్ట్రాల్లో పర్యటించి ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన నివేదికపైనా మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన జరుపుతోంది.
మరోవైపు మందుబాబులకు బిగ్ రిలీఫ్ అని ఎందుకన్నామంటే.. నూతన మద్యం పాలసీలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబర్ నుంచి మొదలయ్యే నూతన మద్యం పాలసీ ద్వారా ప్రముఖ మద్యం బాండ్లను తిరిగి ఏపీలోకి తేవాలని భావిస్తోంది. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యం అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బ్రాండ్లను తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఎంఎన్‌సీ బాండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని ఆలోచిస్తోంది. తక్కువ ధర కేటగిరిలో క్వార్టర్ బాటిల్‌ను రూ.80 నుంచి రూ.90 లకే అందించాలని ప్రణాళికలు రచిస్తోంది. వీటిన్నింటినీ పరిశీలించి నూతన మద్యం విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం రూపొందించనుంది.
మరోవైపు మద్యం పాలసీ రూపకల్పన కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో పర్యటించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. తెలంగాణ, యూపీ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలలో పర్యటించిన అధికారులు.. అక్కడి మద్యం పాలసీని, మద్యం నాణ్యత, రేట్లు, మద్యం షాపుల నిర్వహణ వంటి విధానాలను పరిశీలించారు. అనంతరం సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించనున్న కేబినెట్ సబ్ కమిటీ.. అవసరమైతే పక్క రాష్ట్రాల్లోని విధానాలను మరోసారి అధ్యయనం చేసి నూతన మద్యం పాలసీకి రూపకల్పన చేయనుంది. అలాగే ఈసారి గౌడ, ఈడిగ కులస్థులకు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.