ఏపీలో భారీ వర్షాలు, వరదలు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లను ఢీకొట్టి వ్యవహారం రాజకీయంగా కాకరేపుతోంది. గేట్లను ఢీకొట్టిన బోట్లు.. వైసీపీ నేతలక చెందినవని సీఎం చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీ నేతలంతా ఆరోపిస్తున్నారు. ఈ కుట్రలో వైసీపీ నేతలు నందిగాం సురేష్, తలశిల రఘురామ్ పాత్ర ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ బోట్లు టీడీపీకి చెందినవేనని వైసీపీ ఆరోపిస్తోంది. నందిగామ సురేష్‌ను పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఇదే ఆరోపణలు చేశారు. టీడీపీ గెలిచాక ఇదే బోట్లపై విజయోత్సవాలు చేశారంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ఆరోపణలకు ఏపీ మంత్రులు కౌంటరివ్వడం మొదలెట్టారు.
ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలకు చెందినవేనని ఏపీ రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన మంత్రి.. వైఎస్ జగన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. విపత్తు సమయంలో అందరూ తమకు చేతనైన సాయం చేస్తుంటే.. వైసీపీ మాత్రం పాలిటిక్స్ చేస్తోందని రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి కూల్చివేసి.. ఏపీలో రాష్ట్రపతి పాలన తేవాలనే కుట్రతోనే ఇదంతా చేశారంటూ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఇక జైలుకు వెళ్లి నందిగం సురేష్‌ను వైఎస్ జగన్ పరామర్శించడంపై మంత్రి సెటైర్లు వేశారు. ఆయనేమైనా స్వాతంత్ర సమరయోధుడా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే వైసీపీకీ మాత్రం రాజకీయాలు కావాల్సి వచ్చిందని మండిపల్లి మండిపడ్డారు.
మరోవైపు ఏపీ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని.. తమ కార్యకర్తలపై దాడులు చేస్తోందంటూ వైఎస్ జగన్ అప్పట్లో ఆరోపించారు. అంతేకాదు ఏకంగా ఢిల్లీలో ధర్నా చేసి.. ఈ విషయాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు. దాడులపై ఫోటో గ్యాలరీ, వీడియో గ్యాలరీని ప్రదర్శించిన వైసీపీ.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అప్పట్లో డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి మంత్రి నోటి నుంచి రాష్ట్రపతి పాలన మాట రావడం ఆసక్తికరంగా మారింది.