ఏపీలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ప్రాణనష్టంతో పాటుగా భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో వర్షాలు, (Andhra Pradesh Floods) వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఏపీలో వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో వరి పంటకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ నెల 17లోపు వరద బాధితులకు పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. కొన్నిచోట్ల ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై సమీక్షించిన చంద్రబాబు నాయుడు.. ఉప్పుటేరు, ఎర్రకాలువ వరదలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా పూర్తిచేస్తామని రైతాంగానికి హామీ ఇచ్చారు.
మరోవైపు వైసీపీ పాలనలో బుడమేరు ఆక్రమణలకు గురైందన్న చంద్రబాబు నాయుడు.. బుడమేరుకు గండ్లుపడితే పూడ్చలేదని ఆరోపించారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారని, తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారని ఆరోపించారు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వటంతోనే బుడమేరు ఆక్రమణకు గురైందని విమర్శించారు. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రీపగలు పర్యవేక్షించి బుడమేరు గండ్లు పూడ్చివేయించటంతోనే.. విజయవాడకు వరద తగ్గిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్దకు బోట్లు వదిలింది వైసీపీ నేతలేనని ఆరోపించారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వమే 72 శాతం పూర్తిచేసిందన్న చంద్రబాబు.. వైసీపీ పాలనలో ఏపీ జీవనాడి అయిన పోలవరాన్ని ముంచేశారని ఆరోపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుందన్న చంద్రబాబు.. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి 12 వేలకోట్లు తీసుకువచ్చామన్నారు. త్వరలోనే పోలవరం పనులు ప్రారంభించి.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. అలాగే వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామన్న చంద్రబాబు నాయుడు.. కౌలు రైతుల ఖాతాల్లోకి నేరుగా ఇన్‌పుట్ సబ్సిడీని వేస్తామని ప్రకటించారు.