నిమ్మ ధర రైతుల ఆశలకు అనుగుణంగా నిలకడగా కొనసాగుతోంది. ఏడు నెలలుగా కిలో రూ.50 నుంచి రూ.100 మధ్య నిలకడగా ఉంది. దీంతో రైతులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏటికేడాది నిమ్మకాయలకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతుండగా ఏడు నెలలుగా ధర నిలకడకగా ఉండడం ఆర్థిక వెసులుబాటుకు దోహదపడిందని రైతులు పేర్కొంటున్నారు. గతంలో ధర పెరిగినా వారం పది రోజుల వరకే ఉండేది. కానీ ఇప్పుడు ఏడు నెలలుగా ధర నిలకడగా ఉండడం ఊహించని పరిణామని రైతులు చెప్తున్నారు. దిగుబడి తగ్గడం వల్ల డిమాండ్ పెరిగిందని ఈ కారణంగానే నిమ్మకాయల ధర పెరిగిందని చాలామంది అప్పుల ఊబి నుంచి బయట పడ్డారని రైతులు చెబుతున్నారు. బయట రిటైల్ మార్కెట్‌లో కాయ ఒకటి నాలుగు నుంచి ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు. నిమ్మకాయలు దక్షిణాది నుంచి ఉత్తరాది రాష్ర్టాలకు ఎక్కువుగా ఎగుమతి అవుతుంటాయి. సెప్టెంబరు నెలలో దెందులూరు మార్కెట్ యార్డు నుంచి సాధారణంగా రెండులారీల సరుకు వెళ్ళేది. అలాంటిది ఇప్పుడు ఒక్క లారీ సరుకు కూడా రావడం లేదు. దిగుబడి గణనీయంగా తగ్గడంతో సరుకులేక ధర పెరిగింది. ఈ ఏడాది అధికంగా పడిన వర్షాలతో నిమ్మ పూత, కాత లేకపోయింది. పూతలేక దిగుబడి తగ్గి మార్కెట్‌కు కాయలు రాక తగ్గిపోయింది. ధర పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తోంది.ఉత్తరాది రాష్ర్టాల్లో నిమ్మకాయల వాడకం కూడా ఎక్కువుగా ఉంది. దీంతో ఏడు నెలలుగా ధర నిలకడగా ఉంది. నిమ్మకాయల చరిత్రలో ఎప్పుడూ కూడా ఇన్నినెలలు నిలకడగా ఉన్న దాఖలాలు లేవు. గట్టిగా రెండు, మూడు వారాలు ధర గరిష్టంగా ఉండేది. ఆ సమయంలో కాయలు ఉన్న వారు దాదాపుగా 25 నుంచి 30 శాతం మంది రైతులే లాభాలను అందుకునే వారు. ఈసారి ప్రతి రైతు కూడా గరిష్ట ధరను అందుకున్నారు.ఈ ఏడాది నిమ్మ కాయల దిగుబడి తగ్గింది. తక్కువ దిగుబడి వచ్చినా ధర బాగుండడంతో ఆశించిన ఆదాయం వచ్చింది. కానీ పెట్టుబడి మాత్రం పెరిగిపోయింది. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరిగి పోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఎరువులు, పురుగు మందులను రాయితీపై అందిస్తే రైతుకు మరింత మేలు జరుగుతుంది. దీంతో పాటు ప్రభుత్వం మారింది. కాబట్టి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ పథకంలో కూలీలు రైతుల పొలాల్లో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే జరిగితే రైతుకు మరింత లాభదాయకంగా ఉంటుంది.