ఇటీవల ఏలూరు జిల్లాలో వచ్చిన వర్షాలకు వరద ప్రవాహంతో అడవుల్లో ఉన్న పాములు వరదలకు కొట్టుకువచ్చి గ్రామాలపై పడ్డాయి. మరికొన్ని పాములు ఆ వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి సమీపంలోని పొలాల్లోకి చేరాయి. కొల్లేరు, తమ్మిలేరు, బుడమేరు, రామి లేరు, ఏజెన్సీలో కొండవాగుల వరదలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. వరద నీటిలో పాములు కొట్టుకువచ్చి ఊళ్ల మధ్యకు చేరాయి. ఇటీవల ఏలూరు ప్రభుత్వాస్పత్రికి రోజుకి నాలుగు నుంచి ఏడు కేసులు పాము కాటుకు గురైన వారు వస్తున్నారంటే ఈ పాములు ఏ విధంగా ప్రజల మధ్యలోకి వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. పొలం పనులకు వెళ్లినవారు, పొలంలో గడ్డి కోసేవారు, గట్లపై నడిచేవారే ఎక్కువ పాముకాటుకు గురవుతున్నారు. వర్షాకాలం కావడంతో వర్షాలు పడేటప్పుడు కట్లపాములు ఇళ్లమెట్ల వద్ద పడుకుని ఉంటాయి. వర్షాలు, వరదలతో కలుగుల్లో దాక్కున్న పాములు బయటకి వస్తున్నాయి. పొలం పనులకు వెళ్తున్న వారిని కాటేసి ప్రాణాలు బలిగొంటున్నాయి. రెండు నెలలుగా పాము కాటు బాధితులు పెరుగుతున్నారు. వరి పొలాల్లో ఎక్కువగా పాముల బెడద ఉంటుంది. రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలి. పాములన్నీ విషకారకం కావని వైద్య సిబ్బంది తెలిపారు. పాము కరిచిన చోట రెండు గాట్లు ఉంటే 90 శాతానికి పైబడి విషకారక పాము కాదని భావిస్తామన్నారు. పాముకాటు బాధితులకు రక్తం వాంతులు, మలమూత్ర విసర్జన సమయంలో రక్తస్రావం, మగత ఉంటాయన్నారు. విషకారక పాము కాటుకు వెంటనే చికిత్స తీసుకోకుంటే కిడ్నీలతో పాటు శరీరంలోని ముఖ్య అవయవాలన్నీ పాడైపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందన్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితికి అను గుణంగా ఒకటి నుంచి నాలుగు వరకూ ఏఎస్‌వీ ఇంజక్షన్లు వేసి ప్రాణాలు కాపాడతామన్నారు.