కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వినాయకస్వామి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.రథోత్సవం మరుసటి రోజున తన మానస పుత్రికలైన సిద్ధి,బుద్దిలతో పెళ్లిపెద్దగా బ్రహ్మ వ్యవహరించి వినాయకస్వామికి వివాహం జరిపిస్తారని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఉదయం ఉభయదారులైన కాణిపాకం, తిరువణంపల్లెలకు చెందిన వణిగ వంశస్థుల ఆధ్వర్యంలో మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. అనంతరం కాణిపాక పురవీధుల్లో కలశాలతో పాలను తీసుకొని ఊరేగించారు.అలంకార మండపంలో సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవర్లకు పాలాభిషేకం నిర్వహించారు.కల్యాణోత్సవ సందర్భంగా టీటీడీ తరపున ఈవో శ్యామలరావు వరసిద్ధుడికి పట్టు వస్త్రాలను అందజేశారు.రాత్రి అలంకార మండపంలో ప్రత్యేక కల్యాణ మండప వేదికపైకి వధూవరులను తీసుకొచ్చి మంగళ వాయిద్యాల నడుమ శాస్ర్తోక్తంగా స్వామి వివాహం జరిపించారు.అనంతరం స్వామివారి ఊరేగింపులో భాగంగా గంగుండ్రి మండపం వద్ద స్వామివారు దోపిడికి గురయ్యారు.అత్తవారు కట్టించిన కుడుములు, ఉండ్రాళ్లు, చిల్లర కాసులను భక్తులు దోపిడి చేశారు. ఈ తంతు ముగియగానే కొంత సేపు స్వామివారిని, సిద్ధి,బుద్ధిని గంగుండ్రి మండపం వద్ద ఉంచి విద్యుత్ దీపాలను తొలగించారు. అనంతరం విద్యుత్‌ను పునరుద్ధరించి ఊరేగింపును కొనసాగించారు.ఈ వేడుకలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మురళీమోహన్,ఆలయ ఈవో గురుప్రసాద్, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి,విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రవి,విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.