వందరోజుల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. పొదిలి స్థానిక రెండవ సచివాలయంలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వందరోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన మంచిపనులు, సంక్షేమ పథకాల గురించి సచివాయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి విచారించాల న్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో ప్రజాపాలన వందరోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనకు పెద్దఎత్తున ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు.
చంద్రబాబునాయుడు అంటే ఒక బ్రాండని అందుకు నిదర్శనమే ఇటీవల విజయవాడ బుడమేరు ముంపు గ్రామాల్లో రేయింబవళ్ళు పర్యటించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఊపిరిపీల్చుకున్నారన్నారు. వందరోజుల్లో గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలకు ఒక భరోసా ఉంటుందన్నారు. పట్టణాధ్యక్షుడు ఖుద్దూస్ మాట్లాడుతూ కూటమిని ప్రజలు ఆశీర్వదించారని అందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి వందరోజుల్లో గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజలకు పాలన అందించారన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్లను పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
రాష్ట్రాభివృద్దే ముఖ్యమంత్రి ఆశయమని ఆయన అన్నారు. ముస్లిం మైనారిటీ నాయకులు రసూల్ మాట్లాడుతూ.... రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబునాయుడు సారథ్యంలో పాలన ఉండాలని అందుకు మనందరం సహకరించాలన్నారు. వందరోజుల పాలనలో ప్రజలు టీడీపీ పాలనపై ఆశలు పెంచుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంలో మెగా డీఎస్‌సీని ప్రకటించాడన్నారు. దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మారుతీరావ్, వీఆర్‌వో యాకోబు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.