అనంతపురం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆదివారం ఆయన జిల్లాకు వచ్చారు. ముందుగా హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం అనంతపురానికి వచ్చిన మంత్రి రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి జలవనరులే అత్యంత కీలకమని, ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాలతో తాను ప్రాజెక్టుల సందర్శన చేపట్టినట్లు తెలిపారు.
ప్రజలకు తాగు నీరు, రైతులకు ప్రతి ఎకరాకు సాగు నీరందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రాధాన్యం అన్నారు. సీమను రతనాల సీమగా చేయాలన్న సంకల్పంలో భాగంగానే నాడు నందమూరి తారక రామారావు తెలుగు గంగ, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులు చేపట్టారన్నారు. కాగా ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన ప్రాజెక్టులన్నింటినీ భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. సీమ బిడ్డ అని చెప్పుకోవడమే గానీ రాయలసీమకు అత్యంత ద్రోహం చేసిన వ్యక్తి జగన అన్నారు. చంద్రబాబు తన గడిచిన ఐదేళ్ల పాలనలో హంద్రీనీవాకు రూ.4200 కోట్లు ఖర్చు పెడితే జగన కేవలం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. ప్రాజెక్టులపై జగన నిర్లిప్తత, నిర్లక్ష్యం, దగా, ద్రోహానికి ఇదే పరాకాష్ట అన్నారు.