ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన కొత్తవారికి పింఛన్లు ఇస్తామని ప్రకటించగా.. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో అనర్హులపై వేటుకు సిద్ధమవుతున్నారు.. అర్హత లేకపోయినా సరే కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో అలాంటివారిపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. అనర్హుల ఏరివేతకు కసరత్తు మొదలుపెట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు.. ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతలు సిఫార్సు చేయడంతో చాలామంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి.
కొంతమందికి అనర్హత ఉన్నా సరే.. వారిలో వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అర్హత ఉన్నా ఏవేవో కారణాలు చెప్పి పింఛన్లు ఇవ్వకుండా దరఖాస్తుల్ని పక్కనపెట్టారని కొంతమంది ఆరోపించారు. గత ఐదేళల్లో 8లక్షల మందికి పింఛన్లు తొలగించారనే విమర్శలే వినిపిస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలని భావిస్తోంది.. ఆ దిశగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొత్త పింఛన్లపై విధివిధానాల రూపకల్పన కోసం ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఓ యాప్ తీసుకురావాలని భావిస్తోంది. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీకి ఈ యాప్ రూపొందించాలి అనుకుంటున్నారు. దీని కోసం ఐటీ, రవాణాశాఖ, కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటాను తెప్పించుకునే పనిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా తీసుకుని.. ఆరు అంచెల తనిఖీ నిబంధనలను పాటిస్తారు. వాటి ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారుల్లో రాష్ట్రస్థాయిలోనే అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు. వీరిలో కూడా ప్రధానంగా వితంతువులు, ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. ఇలా జాబితాలను రూపొందించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం ఆరు అంచెల నిబంధనల కారణంగా అర్హత ఉన్నా కొందరికీ న్యాయం జరగలేదనే విమర్శలు ఉన్నాయి. దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హుల ఎంపికకు కొత్త విధానాలు రూపొందిస్తారా, లేదా అన్నది స్పష్టత లేదంటున్నారు. ఈ ప్రత్యేక విధానం మొత్తం పూర్తికాగానే అధికారులు గుర్తించిన అర్హుల, అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఒకవేళ ఆ జాబితాల్లో తేడాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.. అనర్హులకు నోటీసులు పంపించి, లిఖితపూర్వక సమాధానాన్ని తీసుకుంటారు.
ఆ తర్వాత గ్రామసభలు నిర్వహించి, అభ్యంతరాలను స్వీకరిస్తారు.. అది కూడా రెండు మూడు రకాలుగా అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అర్హులెవరూ పింఛన్‌కు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అభ్యంతరాలను మళ్లీ ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో తనిఖీ చేయిస్తారు. ఇలా అర్హత ఉన్న ఏ ఒక్కరికి పింఛన్ ఆగకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు అక్టోబరులో దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉందంటున్నారు. ఇలా క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వాటిని ధ్రువీకరించేలా దరఖాస్తుదారుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారు. అంతేకాదు అర్హుల దరఖాస్తులను అధికారులు ఆమోదించకపోయినా, గ్రామసభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా పింఛన్ల విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం.