ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్ సెబాస్టియన్ పెరయిల్ మరణంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఆత్మశక్తి అవసరమని, ఇది దైవత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. పిల్లలకు చదువుతో పాటు పని ఒత్తిడిని జయించడం గురించి కూడా విద్యా సంస్థలు బోధించాల్సిన అవసరం ఉందంటూ ఆమె సూచించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
చెన్నైలోని ఓ మెడికల్ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన నిర్మలా సీతారామన్.. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించి, వారికి ఉద్యోగాలు వచ్చేలా సన్నద్ధత చేయడంతోపాటు పని ఒత్తిడి నిర్వహణపైనా పాఠ్యాంశాలను బోధించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘చదువుల కోసం కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లే మన పిల్లలు.. ఎన్నో కలలతో బయటకు వస్తారు’ అని అన్నారు. ఈ క్రమంలో సీఏ చదివిన ఓ యువతి పని ఒత్తిడికి తట్టుకోలేక మరణించారన్న వార్త తనను కలచి వేసిందని అన్నారు. అయితే సంస్థ గానీ, ప్రాణాలు కోల్పోయిన యువతి పేరును ప్రస్తావించకుండా ఆమె పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
‘‘ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఆత్మశక్తి అవసరం.. ఇది దైవత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.. దైవత్వాన్ని నమ్ముకుంటే ఒత్తిడిని జయించొచ్చు.. దేవుడి మీద నమ్మకం ఉంచితే.. ఆయన అనుగ్రహం ఉంటే.. సహజంగానే క్రమశిక్షణ అలవడుతుంది... అప్పుడే ఆత్మశక్తి పెరుగుతుంది. తద్వారా మనోబలం సమకూరుతుంది’ అని నిర్మలా సీతారామన్ అన్నారు. దైవత్వాన్ని, ఆధ్యాత్మికతను విద్యా సంస్థలు బోధిస్తే.. మనోబలంతో పిల్లలు వృద్ధిలోకి రాగలరని తాను విశ్వసిస్తానని చెప్పారు.
అయితే, పని ప్రదేశంలో క్షీణిస్తున్న పరిస్థితుల గురించి మాట్లాడకుండా.. ఒత్తిడి జయించడం గురించి మాట్లాడటంపై సోషల్ మీడియాలో సైతం నిర్మలా సీతారామన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆర్థిక మంత్రి మాట్లాడుతారని, వారి శ్రమ దోపిడీకి గురైన అన్నా సెబాస్టియన్ వంటివారి బాధలు ఆమెకు పట్టవంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి.. ఆమెదే తప్పన్నట్లు మాట్లాడడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది.. ‘‘డియర్ నిర్మలా జీ.. క్లిష్టమైన కోర్సుల్లో ఒకటైన సీఏ డిగ్రీని పూర్తి చేసిన అమ్మాయికి పని ఒత్తిడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. వీలైతే పని విధానం, సుదీర్ఘ పని గంటలు వంటి అంశాల గురించి మాట్లాడండి.. లేదంటే సున్నిత అంశాల జోలికెళ్లకుండా ఉండండి’’ అంటూ చురకలంటించారు.
సీపీఐ ఎంపీ ఎం సందోష్ కుమార్ ‘దేశవ్యాప్తంగా శ్రామిక వరగాల రోజువారీ పోరాటాలను కేంద్ర ఆర్ధిక మంత్రి కించపరిచారు.. సుదీర్ఘ పని గంటలు, అమానవీయ పని పరిస్థితులు, విస్తృత నిరుద్యోగం.. సామాజిక భద్రత లేకపోవడం వంటివి కార్మికులలో ముఖ్యంగా అన్ని వృత్తుల్లో మన యువతలో ఒత్తిడి, అభద్రతను సృష్టిస్తున్నాయి. ఈ నిర్మాణాత్మక ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా 'దేవునిపై ఆధారపడండి' అనే ఆర్థిక మంత్రి సలహా విచిత్రమైంది’ అని మండిపడ్డారు.