దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో రెండు రోజుల కిందట వెలుగులోకి వచ్చిన మహిళ హత్యోదంతం సంచలనంగా మారింది. రెండేళ్ల కిందట ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే మహాలక్ష్మి అనే మహిళలను నిందితుడు దారుణంగా చంపాడు. ఆమెను హత్యచేసి.. 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆమెను హత్యచేసిన వ్యక్తి ఎవరో గుర్తించారు. అతడ్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. బెంగళూరు నగర కమిషనర్ దయానంద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడ్ని గుర్తించామని చెప్పారు. అతడిది వేరే రాష్ట్రమని అన్న ఆయన.. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తు్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉండగా ఇంతకంటే వివరాలను వెల్లడించలేమని ఆయన అన్నారు.
హతురాలు మహాలక్ష్మీ.. మల్లేశ్వరంలోని ఓ మాల్‌లో పనిచేస్తూ.. భర్తకు దూరంగా ఉంటోంది. అయితే, ఒక వ్యక్తి రోజూ వచ్చి ఆమెను తీసుకెళ్లి.. మళ్లీ దింపుతాడని స్థానికులు ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో అతడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించడానికి 4-5 రోజుల ముందు హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్రిజ్‌లో మహాలక్ష్మి ఛిద్రమైన అవశేషాలు చూసి కుటుంబసభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
అయితే, నిందితుడితో పాటు బాధితురాలిది వేరే రాష్ట్రమని, కర్ణాటకలో ఉంటున్నారని పోలీస్ కమిషనర్ చెప్పారు. కాగా, ఈ కేసుపై కర్ణాటక హోమ్ మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. పోలీసులు ప్రధాన నిందితుడ్ని గుర్తించారని, అతడి సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని అన్నారు. అలాగే, పూర్తి వివరాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని ఆయన చెప్పారు. అలాగే, నగరంలో మహిళ భద్రత గురించి తీసుకుంటున్న చర్యల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఈ విషయంలో మేము చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై మేము అప్రమత్తంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతంగా జరుగుతోంది.
మరోవైపు, ఘటనా స్థలిలో బాధితురాలు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్విచ్ఛాప్‌లో ఉండటంతో ఆమె ఆఫ్ చేశారా? లేదా హత్య తర్వాత నిందితులు అలా చేశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఆమె కాల్ రికార్డ్‌లు, సోషల్ మీడియా యాక్టివిటీ, వాట్సాప్ చాట్‌లను పోలీసులు సమీక్షిస్తున్నారు. తదుపరి విశ్లేషణ కోసం దానిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపే యోచనలో ఉన్నారు. నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన అన్నారు.