భారత్‌లో మంకీపాక్స్ మరో కేసు నమోదైంది. ఈసారి నమోదైన కేసు ‘హెల్త్ ఎమర్జెన్సీ’కి కారణమైన ‘క్లాడ్ 1బీ’ రకం కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ రకం ఎంపాక్స్ ఆఫ్రికాను అతలాకుతలం చేసింది. కేరళకు చెందిన 38 ఏళ్ల యువకుడిలో క్లాడ్ 1బీ రకం మంకీపాక్స్ వ్యాధి నిర్ధరణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కేరళలోని మలప్పురానికి చెందిన ఈ వ్యక్తి ఇటీవలే యూఏఈ నుంచి స్వస్థలానికి వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లాడ్ 1గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.
దేశంలో మంకీపాక్స్‌కు సంబంధించిన తొలి కేసు సెప్టెంబర్ 9న నమోదైంది. ఇప్పటివరకూ మొత్తం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఇవన్నీ క్లాడ్ 2 రకానికి చెందినవి. దీని తీవ్రత తక్కువగా ఉంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. తాజాగా నమోదైన క్లాడ్ 1బీ రకం ఎంపాక్స్ రకం వ్యాధికి వ్యాప్తి చెందే గుణం ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంది.
మంకీపాక్స్ అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది మనిషి నుంచి మనుషులకు, జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉన్న వ్యాధి. ఈ వ్యాధి వివిధ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఆరోగ్య అత్యవసర స్థితి’ (Health Emergency) సమస్యగా ప్రకటించింది. ప్రారంభంలో ఈ వ్యాధి ఎక్కువగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైంది. క్రమంగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందింది.
ఎంపాక్స్ లక్షణాలు:
మంకీపాక్స్ సాధారణంగా సోకిన తర్వాత 5 నుంచి 21 రోజుల లోపు లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు మశూచిని (Smallpox) పోలి ఉంటాయి.
✦ దద్దుర్లు
✦ జ్వరం
✦ గొంతు నొప్పి
✦ తలనొప్పి
✦ కండరాల నొప్పులు
✦ వెన్నునొప్పి
✦ నీరసం
✦ శోషరస కండరాల వాపు
తదితర లక్షణాలు కనిపిస్తాయి.
పగిలిన చర్మం, శ్వాసకోశం, కళ్లు, ముక్కు, నోటి ద్వారా ఈ వైరస్.. మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎంపాక్స్ వ్యాధి బారిన పడితే.. చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకుంటారు. కొంత మంది మాత్రమే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతతారని వైద్య అధికారులు తెలిపారు. మంకీపాక్స్ ప్రధానంగా ఆ వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినప్పుడు వ్యాపిస్తుంది.
మంకీపాక్స్ వైరస్ రెండు ప్రధాన రకాలు క్లాడ్ 1, క్లాడ్ 2 ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. వీటిలో క్లాడ్ 1B రకం వైరస్‌ను ప్రజారోగ్య అత్యవసర స్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా భారత్ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది.