అల్లూరిజిల్లా మారేడుమిల్లి జలతరంగిణిలో ఆదివారం కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థి చింతకుంట్ల హరదీప్ అచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటన అనంతరం సహాయక చర్యలు చేపట్టిన అధికారులు సోమవారం ఇద్దరు వైద్య విద్యార్థినుల మృతదేహాలను కనుగొన్న సంగతి తెలిసిందే. మరొక విద్యార్థి హరదీ ప్ ఆచూకీ కోసం మంగళవారం కూడా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో కొండ వాగులు, కల్వర్టులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయినప్పటికీ విద్యార్థి జాడ కన్పించక పోవడంతో రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహళ్లి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి డ్రోన్ కెమెరాను వినియోగిస్తూ అనువనువునా జల్లెడ పడుతున్నారు. జలతరంగిణి నుంచి నీటి ప్రవాహం పలు కల్వర్టులు, దట్టమైన పొదలు మీదుగా ప్రవహిస్తూ పాములేరు వాగులోకి అక్కడి నుంచి గోదావరి నదిలోకి నీటి ప్రవాహం చేరుకొనే అవకాశం ఉండడంతో ఆదిశగా గాలింపు చర్యలను పోలీసు అధికారులు ముమ్మరం చేశారు.
దీనిలో భాగంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ప్రత్యేక బృందం డ్రోన్ కెమెరా సాయంతో పాములేరు వాగులో కొన్ని కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం బాగా చీకటిపడడంతో పాములేరు వాగు ప్రమా దకరంగా ఉండడంతో తిరిగి బుధవారం ఈ గాలింపు చర్యలను ముమ్మరం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సబ్‌కలెక్టరు కల్పశ్రీ, తహశీల్దారు సుబ్బారావు, సీఐ మురళీకృష్ణ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.