సనాతన ధర్మానికి హాని కలిగితే ఎటువంటి పరిస్థితిలోనూ ఊరుకునేది లేదని, ప్రాణాలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ‘‘చేతులెత్తి నమస్కరిస్తున్నా.. సనాతన ధర్మానికి హాని జరిగితే మౌనంగా ఉండటం మంచిది కాదు’’ అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అన్నారు. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంలో వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి క్షమాపణలు కోరుతూ ఆయన 11 రోజుల ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానం గుడి మెట్ల మార్గాన్ని నీళ్లు పోసి కడిగి శుభ్రం చేశారు. పసుపు రాసి కుంకుమ అద్దారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.
పూజల అనంతరం ఆయనకు వేద పండితులు, అర్చకులు ఆశీస్సులు అందచేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై హిందువులందరూ కలిసికట్టుగా మాట్లాడాలి. దీనిపై మౌనం మంచిది కాదు. వైసీపీ వాళ్ల మాటలు మరింత వేదన కలిగిస్తున్నాయి. తప్పును ఒప్పుకోకుండా బుకాయింపులతో కాలక్షేపం చేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చితం చేసుకుంటామని చెప్పాలి. అంతేకానీ ఇష్టానుసారం మాట్లాడటమేమిటి? దుర్గగుడిలో వెండిరథం సింహాల ప్రతిమలు మాయమైతే అప్పట్లో వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు నాడు క్రైస్తవులో, మరొకరో చేయలేదు. చేతులకు తాళ్లు కట్టుకుని బొట్టుపెట్టుకునే హిందువులే మాట్లాడారు’’ అన్నారు.