అనంతపురం జిల్లాకు 370 గోకులం షెడ్లు మంజూరు అయ్యాయని పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటస్వామి తెలిపారు. ఉరవకొండ పట్టణంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు 370 దాకా గోకులం షెడ్లు మంజూరు అయ్యాయని, ఒక్కొక్క మండలానికి 47 దాకా మంజూరైనట్లు తెలిపారు. వాటి నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయని వెల్లడించారు. పశుపోషణ బీమా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకంలో ప్రభుత్వం 80శాతం ప్రీమియం చెలిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు పశువులు చనిపోతే రూ.30వేల నుంచి రూ.1.2లక్షల దాకా పరిహారం వస్తుందన్నారు. వచ్చేనెల 1 నుంచి 15వ తేదీ వరకూ డీవార్మింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 27లక్షల దాకా గొర్రెలు, మేకలు ఉంటాయన్నారు. గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమం కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ వెంకటేశ్వర్లు, ఏడీ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.