2022లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన దారుణమైన లైంగిక దాడి ఘటనలో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మరణశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మరో ఇద్దరికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తుది తీర్పు వెల్లడించింది. రెసిడెన్షియల్ పాఠశాలలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేసే వ్యక్తి.. ఆ హాస్టల్‌లో ఉండే బాలికలపై కన్నేశాడు. ఈ క్రమంలోనే సమయం దొరికినప్పుడల్లా వారిపై లైంగిక దాడి చేసినట్లు తేలింది. అయితే ఇద్దరు కవలలు.. ఈ విషయాన్ని తండ్రికి తెలపగా.. ఆయన ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 21 మంది చిన్నారులపై ఆ హాస్టల్ వార్డెన్ లైంగిక దాడి చేయగా.. అందులో బాలురు కూడా ఉండటం సంచలనంగా మారింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని షీ యోమీ జిల్లాలోని మోనిగోంగ్ పోలీస్ స్టేషన్‌లో 2022 నవంబర్‌లో ఒక కేసు ఫైల్ అయింది. స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివే 12 ఏళ్ల ఇద్దరు కవలలు.. హాస్టల్ వార్డెన్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని తండ్రికి చెప్పారు. దీంతో ఆ హాస్టల్ వార్డెన్ యుమ్కెన్ బాగ్రాపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ రెసిడెన్షియల్ హాస్టల్‌లో విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఇద్దరు కవలలతోనే కాకుండా హాస్టల్‌లో ఉండే ఇతర బాలికలపై ఆ వార్డెన్ లైంగిక దాడి చేసినట్లు గుర్తించారు.
అంతేకాకుండా 2014 నుంచి 2022 వరకు మొత్తం 21మంది బాలికలపై అతడు లైంగిక దాడులు, వేధింపులు పాల్పడినట్లు గుర్తించారు. ఇక అందులో ఆరుగురు బాలురు కూడా ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. ఆ బాలుర వయసు కూడా 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిందితుడు యుమ్కెన్ బాగ్రాపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. మరో ఇద్దరిపైనా అభియోగాలు మోపారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్ మాజీ ప్రిన్సిపల్, హిందీ మహిళా టీచర్‌లపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. తాజాగా పోక్సో స్పెషల్ తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో యుమ్కెన్ బాగ్రాను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి మరణశిక్ష విధించింది. అంతేకాకుండా అతడికి సహకరించిన మరో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్షను తాజాగా ఖరారు చేసింది.
ఇక ఈ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేయగా.. గతేడాది జులైలో సిట్ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. బాలికలపై లైంగిక దాడికి పాల్పడేముందు వారికి వార్డెన్ మత్తుమందు ఇచ్చేవాడని తేల్చారు. ఇక ఈ లైంగిక దాడికి సంబంధించిన విషయాలను ఎవరికీ చెప్పవద్దని వారిని బెదిరించేవాడని గుర్తించారు. ఈ క్రమంలో ఆరుగురు బాలికలు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారని తేలింది. అయితే వార్డెన్ అకృత్యాల గురించి ఓ మహిళా టీచర్‌కు బాధిత చిన్నారులు చెప్పినప్పటికీ.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని వెల్లడైంది.