ప్రపంచవ్యాప్తంగా తమపై జరిగిన అత్యాచార ఘటనలపై చాలా మంది బయటపెడుతున్నారు. మీటూ ఉద్యమం స్ఫూర్తితో ఒక్కొక్కరూ తమకు జరిగిన అన్యాయాలను వివిధ వేదికల ద్వారా ప్రపంచానికి తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈజిప్ట్ దేశానికి చెందిన ఓ కోటీశ్వరుడిపై గత కొన్నేళ్లుగా తీవ్ర లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిజినెస్‌మెన్ అయిన 94 ఏళ్ల మహ్మద్ అల్ ఫయాద్.. గతేడాది చనిపోగా.. ఆయన గతంలో చేసిన అకృత్యాలకు సంబంధించి ఓ మీడియా సంస్థ ఇటీవల ఓ డాక్యుమెంటరీని రూపొందించి విడుదల చేసింది. ఇది కాస్తా బయటికి రావడంతో మహ్మద్ అల్ ఫయాద్ బాధితులు ఒక్కొక్కరుగా కోర్టులకు వచ్చి తమపై జరిగిన లైంగిక దాడి గురించి చెబుతున్నారు.
బ్రిటన్‌లో ప్రముఖ లగ్జరీ డిపార్ట్‌మెంట్ స్టోర్ హారోడ్స్ సంస్థకు గతంలో ఓనర్‌గా పనిచేసిన మహ్మద్ అల్ ఫయాద్.. తన సంస్థలో పనిచేసే అనేక మంది ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అతనిపై ఇప్పటివరకు 60 మంది మహిళలు బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. అయితే మహ్మద్ అల్ ఫయాద్ బాధితులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటారని బాధితుల తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు. 1985 నుంచి 2010 మధ్య హారోడ్స్ సంస్థలో ఇలాంటివి ఎన్నో దారుణాలు జరిగినా ఆ కంపెనీ మాత్రం వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.
అయితే మహ్మద్ అల్ ఫయాద్‌పై వచ్చిన ఈ లైంగిక ఆరోపణలను లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఇంకా మహ్మద్ అల్ ఫయాద్ బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. వీటిపై దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ కేసుకు సంబంధించి బ్రిటన్ కోర్టు విచారణ ప్రారంభించగా.. ఇప్పటివరకు 60 మంది మహిళలు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. అయితే బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని లాయర్లు కోర్టుకు తెలిపారు. 150 మందికిపైగా మహిళలు మహ్మద్ అల్ ఫయాద్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారని పేర్కొన్నారు.
ఇక హారోడ్స్ డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌ను 2010లోనే ఖతార్‌కు చెందిన ఓ కంపెనీ టేకోవర్ చేసింది. దీంతో మహ్మద్ అల్ ఫయాద్.. కంపెనీ నుంచి పక్కకు తప్పుకున్నారు. కాగా ఈ పరిణామాలపై ప్రస్తుతం హారోడ్స్ కంపెనీ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. మహ్మద్ అల్ ఫయాద్‌కు సంబంధించిన లైంగిక ఆరోపణలు, నేర చరిత్ర గురించి అప్పట్లో తనకు తెలియదని ప్రస్తుత ఎండీ మైఖేల్ వార్డ్ తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.