సాధారణంగా రూ.10 కో, రూ.20కో దొరికే కండోమ్ మనం చాలానే చూసి ఉంటాం. ఇక మార్కెట్లో రకరకాల కంపెనీలకు సంబంధించిన కండోమ్‌లు విక్రయిస్తూ ఉన్నారు. సురక్షిత శృంగారానికి, అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు ఉపయోగించే కండోమ్‌కు సంబంధించి తాజాగా ఓ కీలక విషయం వెల్లడైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ ధర ఏకంగా అక్షరాలా 44 వేల రూపాయలు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కండోమ్ ధర రూ.44 వేలు ఏంటి అని అది విన్న వారంతా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు.
200 ఏళ్ల క్రితం నాటి కండోమ్‌ను వేలం వేయగా.. అది అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. స్పెయిన్ దేశంలో నిర్వహించిన వేలంలో ఆ పురాతన కండోమ్‌ను ఓ వ్యక్తి ఏకంగా 460 పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.44 వేలు పెట్టి దక్కించుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత ఖరీదైన కండోమ్‌గా అది నిలిచింది. ఈ క్రమంలోనే ఆ కండోమ్ గురించి ఎన్నో విషయాలు వెల్లడయ్యాయి. ఆ కండోమ్ 19 సెంటీమీటర్ల పొడవు అంటే 7 అంగుళాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అది విన్న వారంతా షాక్ అవుతున్నారు. ఇక ఈ కండోమ్‌ను గొర్రెల పేగులతో తయారు చేసినట్లు గుర్తించారు.
కొన్ని రోజుల కిందట.. స్పెయిన్‌లోని ఒక నగరంలో ఒక పెట్టెను గుర్తించారు. దాన్ని తెరిచి అందులో ఏముందో చూడగా.. ఈ కండోమ్ బయటపడింది. అయితే అది పురాతనమైందని గుర్తించి.. దానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ల్యాబ్‌కు తరలించి టెస్ట్‌లు చేశారు. ఈ పరీక్షల్లో అది 18వ శతాబ్దం లేదా 19వ శతాబ్దం నాటిది అని ధ్రువీకరించారు. అంటే 200 ఏళ్ల క్రితం నాటిది అని గుర్తించారు. అయితే ఇప్పుడు ఉన్న కండోమ్‌ల మాదిరిగా కాకుండా గతంలో కండోమ్‌లను గొర్రెలు, పందులు, దూడలు, మేకలు వంటి జంతువుల పేగులతో తయారు చేసేవారు. పైగా ఆ కాలంలో తయారు చేసిన కండోమ్‌లు కనీసం 15 సెంటీమీటర్లు ఉండేవని గుర్తించారు.
ఇక ఆ పురాతన కండోమ్‌ను తాజాగా కాటావీకీ అనే వేలం సంస్థ వేలం వేసింది. ఈ వేలంలో ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన ఓ బిజినెస్‌మెన్.. రూ.44 వేలకు దక్కించుకున్నారు. పురాతన కాలం నాటి కండోమ్ కావడంతో దాన్ని దక్కించుకునేందుకు ఆ బిజినెస్‌మెన్.. వేలంలో దూకుడుగా పాల్గొన్నట్లు కాటావీకీ సంస్థ తెలిపింది. ఇక పురాతన కాలం నాటి కండోమ్స్ మ్యూజియంలో మాత్రమే కనిపిస్తాయి. అలాంటి కండోమ్‌ను వేలంలో దక్కించుకోవడం పట్ల ఆ వ్యాపారవేత్త సంతోషం వ్యక్తం చేశాడు.