ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడ్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. ఇలాంటివి చూసినప్పుడు చాలా కష్టంగా ఉంటుందని.. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా బలి చేస్తారని.. చివరికి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారన్నారు. ముఖ్యమంత్రిని చేస్తానని పురందేశ్వరి భర్తను చంద్రబాబు మోసం చేశారని.. నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణలను ఎలా వాడుకుని బలి చేశారో చూశామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ప్రజలతో ఆడుకున్నారని.. ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో అబద్ధపు హామీలిచ్చారన్నారు.
చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేసి ఎన్నికల్లో విజయం సాధించారని ఆరోపించారు రోజా. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. విజయవాడలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుంటే.. కనీసం వాళ్లకు తాగేందుకు నీళ్లు, పిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోయారన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేస్తుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఈ తప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కల్తీ నెయ్యి వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు.
ఒకవేళ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించి ఉంటే విచారణ చేయాలని.. ఇలా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు రోజా. చంద్రబాబు తాను చెప్పిన అబద్దాన్ని నిజం చేసేందుకు ఒక తప్పుడు రిపోర్ట్ తీసుకొచ్చారన్నారు. మార్చిలోనే జగన్ ప్రభుత్వం టెండర్ పూర్తయ్యిందని.. జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ సమయంలోనే నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయని.. ఆ ట్యాంకుల్లో నెయ్యి పరీక్షల కోసం పంపిస్తే.. జులైలో రిపోర్ట్స్ వచ్చాయన్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు కూడా నెయ్యిలో వనస్పతి కలిసిందని చెప్పారని.. అలాంటప్పుడు ఎన్డీడీబీ రిపోర్టులో జంతువుల కొవ్వు కలిసిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు పూజలు చేసినా కాళ్లకు షూ వేసుకుంటారని..దేవుడంటే ఆయనకు భయం, భక్తి లేవన్నారు రోజా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ అని.. పిల్లలు బాప్టిజం తీసుకున్నారని.. స్వయంగా ఆయనే చెప్పారన్నారు. అలాంటి వ్యక్తులు సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై తాము సీబీఐ విచారణ కోరుతున్నామని.. గతంలో కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఈ విచారణకైనా సిద్ధమని.. సీబీఐ, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగినా తమకు అభ్యంతరం లేదన్నారు.