దసరా పండగ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి దసరా ఉత్సవాలకు ఆహ్వానించనున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.."ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాదాపు 13శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన యజ్ఞం అమ్మవారి ఉత్సవాలు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.
కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఉత్సవాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాం. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. పార్కింగ్ లాట్స్, క్యూలైన్ల, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. హోల్డింగ్ ఏరియాల నుంచి భక్తులను క్యూ కాంప్లెక్సులకు వాహనాల్లో చేరుస్తాం. అమ్మవారి భక్తులకు వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లూ ఇవ్వాలని నిర్ణయించాం. అందుకు 35లక్షల వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నాం. దేవాలయ పరిసర ప్రాంతాల్లో దాదాపు 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆలయం మెుత్తం నిరంతరం నిఘా ఉంటుంది. కంట్రోల్ రూమ్ నుంచి ఇదంతా అధికారులు పర్యవేక్షిస్తారు. వీవీఐపీల దర్శనాలు ఉదయం 8నుంచి 10గంటల వరకూ, మధ్యాహ్నం 2నుంచి 4వరకూ ఉంటాయి. వీవీఐపీల దర్శనాల సమయంలో సాధారణ భక్తులు దర్శనాలు ఆపడం జరగదు. వృద్ధులు, దివ్యాంగులు సాయంత్రం 4నుంచి 5వరకూ దర్శనం చేసుకోవచ్చు. అందరికీ బంగారు వాకిలి వరకే దర్శనం. అంతరాలయానికి అనుమతి లేదు. ప్రసాదాల విషయంలో ఏమాత్రం రాజీ పడం. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అధికారులను బాధ్యులను చేస్తాం. పారిశుద్ధ్య నిర్వహణపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ సృజన సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య బాధ్యతలు వీఎంసీ చూసుకుంటుంది. నగరమంతా ప్రత్యేక అలంకరణ 2వ తేదీ సాయంత్రానికి పూర్తి చేస్తాం. మూలా నక్షత్ర వేళలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు డిపార్ట్మెంట్ హెడ్‌లతో ఏర్పాట్లపై తుది సమీక్ష ఉంటుంది" అని తెలిపారు.