రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-19 ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లాలో టిడ్కో ఇళ్లను మంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ...పేదల కల నెరవేరాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను పూర్తి చేయకుండా.. వైసీపీ ప్రభుత్వంలో ఆ ఇళ్లకు రంగులు వేశారని విమర్శించారు. ఐదేళ్ల పాటు జగన్ పాలనలో ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశామని అన్నారు. టిడ్కో ఇళ్లకు పూర్వ వైభవం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఇళ్ల లబ్ధిదారులను బలవంతంగా రుణగ్రస్తులను చేశారని చెప్పారు. పది శాతం పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అతి త్వరలో ఇళ్లను అందజేస్తామని తెలిపారు. ఒక్క పాలకొల్లులోనే రూ.150 కోట్లు ఇళ్లను తాకట్టుపెట్టి ఆ నిధులను మాజీ సీఎం జగన్ పక్క దారి పట్టించారని విమర్శించారు. ప్రపంచ స్థాయిలో మళ్లీ అమరావతిని తిరిగి నిలబెట్టేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.