తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సిట్ సభ్యులు తిరుమల చేరుకుని దర్యాప్తు సైతం ప్రారంభించారు. అయితే సిట్ దర్యాప్తు తాత్కాలికంగా ఆగిపోయింది. తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందన్న ఏపీ డీజీపీ..రాష్ట్ర ప్రభుత్వ తరుఫు న్యాయవాదుల సూచనతో అక్టోబర్ 3వ తేదీ వరకూ సిట్ దర్యాప్తు అపివేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ మూడో తేదీ ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్ దర్యాప్తు జరపనుంది.
మరోవైపు తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ల మీద సోమవారం హైకోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి పలు ప్రశ్నలు కూడా సంధించింది. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో సిట్ దర్యాప్తు చేయాలా.. లేదా.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలా అనే దానిపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని సైతం కోరింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తును తాత్కాలికంగా ఆపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మూడో తేదీ విచారణలో సుప్రీంకోర్టు చేసే ఆదేశాల ప్రకారం.. సిట్ దర్యాప్తు ఆధారపడి ఉంటుంది.
మరోవైపు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలపై ఇప్పటికే సిట్ సభ్యులు దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని 9 మంది అధికారుల బృందం తిరుమల చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. టీటీడీ నెయ్యి కొనుగోలు వివరాలు, టెండర్లు వేసిన వ్యక్తులు, టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్‌మెంట్ వివరాలు ఇలాంటివి సేకరించింది. అలాగే కల్తీ నెయ్యి పంపారనే వార్తలు వచ్చిన తమిళనాడుకు చెందిన డెయిరీని సైతం పరిశీలించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఆలోపే.. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు బ్రేక్ పడింది. అక్టోబర్ మూడో తారీఖున సుప్రీంకోర్టు వెల్లడించే ఆదేశాలతో సిట్ దర్యాప్తు కొనసాగింపు ఆధారపడి ఉంది.