లెబనాన్ భూభాగంలో ఉన్న హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించడంతో పశ్చిమాసియా ఇప్పుడు భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి.. ఇజ్రాయెల్ భూభాగంపై వందలకొద్ది క్షిపణులతో ఇరాన్ భీకర దాడికి దిగింది. ఈ క్రమంలోనే ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ భూభాగంలో ఉన్న ఆ దేశ అణు స్థావరాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌ను.. ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరించింది.
ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ భూభాగంపైకి ప్రయోగించింది. ఇరాన్ జరిపిన దాడుల్లో ఒకరు మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాడులకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇజ్రాయెల్.. ఇరాన్ పాలన ప్రపంచ శాంతికి ముప్పు అని తెలిపింది. ఈ క్రమంలోనే ఇరాన్ భూభాగంలో ఉన్న అణు కేంద్రాలు లేదా చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు విఫలం అయ్యాయని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇక ఇరాన్ తమ దేశంపై దాడి చేసి పెద్ద తప్పు చేసిందని.. దానికి కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాడి చేసే వారిపైనే ఎదురు దాడి జరుగుతుందని ఆయన తేల్చి చెప్పారు.
మరోవైపు.. ఇరాన్ క్షిపణి దాడికి గట్టిగా ప్రతిస్పందిస్తామని ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ దాడులకు సీరియస్ రియాక్షన్ ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ ఇప్పటివరకు అనుభవించింది చాలా తక్కువ అని.. భవిష్యత్‌లో ఇంతకంటే ఎక్కువ అనుభవించాల్సి వస్తుందని మరో అధికారి హెచ్చరించారు.
ఇక ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌లోని మొస్సాద్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో పడటంతో ఆ ప్రాంతంలో భారీ గుంత ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా దుమ్ము రేగడంతోపాటు అక్కడ పార్క్ చేసిన వాహనాలన్నీ మట్టిలో కూరుకుపోయాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ దాడిపై స్పందించిన ఇరాన్.. ఇజ్రాయెల్ పౌరులపై దాడులు చేయలేదని.. హమాస్ అధినేత ఇస్మాయెల్ హనీయా, హెజ్‌బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా, నిల్పోరూషన్ మరణాలకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ప్రకటించింది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణిదాడులు చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఎలా రియాక్ట్ అవుతారోనని యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ప్రతీకారం తప్పదని ఇప్పటికే ఇరాన్‌కు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. భారత్‌లోనూ ఇజ్రాయెల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ గురించి ఎక్కువగా ఆరా తీస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, మిజోరాం, ఢిల్లీ, కర్ణాటక, గోవాలో ఇజ్రాయెల్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.