ఇజ్రాయేల్‌పై బాలిస్టిక్, హైపర్ సోనిక్ సహా దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. వీటిలో చాలా వాటిని తన రక్షణ వ్యవస్థ సాయంతో ఇజ్రాయేల్ కూల్చివేయగా.. కొన్ని మాత్రం పలు ప్రాంతాలపై పడ్డాయి. వీటిలో ఒకటి ఇజ్రాయేల్ గూఢచర్య సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని తాకింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ గుంత ఏర్పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను అంతర్జాతీయ మీడియా సీఎన్ఎన్ జియోలొకేట్ చేసింది. మొసాద్ ప్రధాన కార్యాలయానికి 3 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న హెర్జ్లియాలోని ఎత్తైన అపార్ట్మెంట్ భవనం నుంచి చిత్రీకరించారు. మొసాద్ ఆఫీసు ముందున్న పార్కింగ్ స్థలంలో క్షిపణి తాకిడికి గుంత ఏర్పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగి.. అక్కడ ఉన్న పలు వాహనాలను కమ్మేసింది. గుంత పడిన ప్రదేశానికి కొద్ది మీటర్ల దూరంలోనే ఓ మల్టీప్లెక్స్ ఉంది.
మంగళవార రాత్రి సైరన్లు మోగడంతో ఇజ్రాయేల్ నగరాల్లోని 10 మిలియన్లకుపైగా పౌరులు బాంబు షెల్టర్లు, రహదారుల పక్కన ఉన్న రక్షణ స్థావరాల్లోనూ తలదాచుకున్నారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్, యారోలతో మధ్యలోనే అడ్డుకున్నట్టు ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి. కొన్ని నివాసిత ప్రాంతాలను తాకినా నష్టం మాత్రం స్వల్పంగా జరిగిందని పేర్కొన్నాయి.
ఇరాన్ చర్యలపై ఇజ్రాయేల్, అమెరికా తీవ్రంగా స్పందించాయి. ఇందుకు తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హెచ్చరించాయి. భారత్‌లోని ఇజ్రాయేల్ రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి గయ్ నిర్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు తగిన విధంగా బదులిస్తామని అన్నారు. ‘ఒకవేళ ఆయన (ఇరాన్ సుప్రీం నేత ఆయుతుల్లా అలీ ఖమేనీ) మాతో పూర్తిస్థాయి యుద్ధానికి ప్లాన్ చేస్తే అంతకంటే తప్పిదం ఉండదు.. ఇజ్రాయేల్ ప్రతిస్పందన వ్యూహాత్మకంగా.. పిన్ పాయింటెండ్‌గా ఉంటుంది.. పూర్తిస్థాయి యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఇదే సమయంలో భారత్‌లో ఇరాన్ రాయబారి దీనికి భిన్నంగా మాట్లాడారు. ఇజ్రాయేల్‌ను ఒప్పించే సామర్థ్యం భారత్‌కు ఉందని, వారి క్రూరత్వాన్ని ఆపగలదని అన్నారు.
కాగా, లెబనాన్‌లో పరిమితి స్థాయిలో భూతల యుద్ధం ప్రారంభించినట్టు ఇజ్రాయేల్ చేసిన ప్రకటనను హెజ్బొల్లా గ్రూప్ ఖండించింది. ఇజ్రాయేల్ బలగాలు లెబనాన్‌లోకి ప్రవేశించాయనేది అవాస్తవమని చెప్పింది. శత్రువులతో నేరుగా పోరాడేందుకు తమ యోధులు సిద్ధంగా ఉన్నారని ప్రకటన చేసింది. ఇజ్రాయేల్ వైపు మధ్యశ్రేణి క్షిపణులు ప్రయోగించామని, అది ప్రారంభం మాత్రమే అని హెచ్చరికలు చేశారు.