రూ.3కు బిర్యానీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. మీరు వింటున్నది నిజమే. ఇంకేముంది బంరాఫర్ అనుకుని జనాలంతా అక్కడికి పరుగులు తీశారు. అయితే అక్కడికి వెళ్లాక అసలు ట్విస్ట్ ఏంటో తెలుసుకుని అవాక్కయ్యారు.. పాపం నిరాశతో అందరూ వెనక్కు వచ్చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అన్లిమిటెడ్ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. భీమడోలు, తాడేపల్లిగూడెంలో ఇప్పటికే అన్లిమిటెడ్ పేరుతో రెండు రెస్టారెంట్లను ప్రారంభించారు.. వ్యాపారం బాగా నడుస్తోంది. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెంలోని అశ్వారావుపేట రోడ్డులో మరో రెస్టారెంట్ ప్రారంభోత్సవం చేశారు. కొత్త రెస్టారెంట్ ప్రారంభోత్సవం, దసరా కానుకగా రూ.3కే బిర్యానీ ఆఫర్ ప్రకటించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టిగానే ప్రచారం చేశారు.
కొత్త రెస్టారెంట్ ప్రకటించిన ఆఫర్‌లో చిన్న ట్విస్ట్ ఉంది.. ఈ ఆఫర్ కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకే మాత్రమే ఉంటుందని చెప్పారు. రూ.3కే బిర్యానీ ఆఫర్ కోసం జనాలు భారీగా తరలిరాగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ముందు వచ్చిన వారికి రూ.3కే బిర్యానీని అందజేశారు. అక్కడ ఎలాంటి తోపులాటలు, గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెస్టారెంట్ ఆ ఆఫర్‌ను మూడుగంటలు మాత్రమే ప్రకటించడంతో.. ఆ తర్వాత వచ్చినవాళ్లు నిరాశతో వెనక్కు వెళ్లిపోయారు. ఆ మూడు గంటల్లో వచ్చిన వారికి మాత్రం రూ.3కే బిర్యానీ అందజేశామని నిర్వాహకులు తెలిపారు.
అంతేకాదు ఈ రెస్టారెంట్ రూ.3కు బిర్యానీతో పాటుగా మరికొన్ని ఆఫర్లను ప్రకటించింది. రూ.290 ధరకు ఒక వ్యక్తి తిన్నంత బిర్యానీ, రూ.380కే ఒక వ్యక్తి నాలుగు రకాల స్టార్టర్ ఐటెమ్స్‌లో ఏవైనా ఎంతైనా తినే ఆఫర్ కూడా ప్రకటించారు. రూ.580 ధరకు ఇద్దరు వ్యక్తులకు మెనూలో ఉన్న 30 రకాల ఫుడ్ ఐటెమ్స్ ఎంతైనా తినొచ్చని ఆఫర్ ఇచ్చారు. ఒక వ్యక్తి రూ.680 ధరకు రెస్టారెంట్ లో 400 రకాల ఐటెమ్స్‌లో ఏవైనా ఏంతైనా తినొచ్చని ప్రకటించారు. మరో వంద అదనంగా చెల్లిస్తే 20 రకాల మాక్‌టైల్స్, కూల్‌డ్రింక్స్ ఎన్నైనా తాగొచ్చని ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ల కోసం జనాలు క్యూ కట్టారు.