విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకలను చూసేందుకు, అమ్మవారి కృపకు పాత్రులయ్యేందుకు వీఐపీల దగ్గర నుంచి సామాన్య భక్తుల వరకూ కొండకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం, ప్రభుత్వం వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే అమ్మవారి సన్నిధిలో డ్యూటీ చేయడానికి వచ్చిన కొంతమంది పోలీసులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో డ్యూటీ చేయడానికి వచ్చిన పోలీసులు.. బాధ్యత మరిచి వ్యవహరించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చూడాల్సిన పోలీసులు.. తామే గాడి తప్పారు. విధులు నిర్వహించకుండా నలుగురు పోలీసులు.. పేకాట ఆడుతూ ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరంతా సీఐలని తెలుస్తోంది. నలుగురూ కూర్చుని పేకాట ఆడుతున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వెంటనే వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజనం ఈ పోలీసులను ఆడేసుకుంటున్నారు. దుర్గ గుడికి డ్యూటీకి వచ్చి మీరు చేస్తున్న పనేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. బాధ్యత గల వృత్తిలో ఉంటూ చేసే పని ఇదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఈ నలుగురు పోలీసులు ఓ హోటల్‌లో పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దుర్గ గుడి పోలీసుల వీడియో వ్యవహారం ఉన్నతాధికారుల వరకూ వెళ్లినట్లు సమాచారం. దీనిపై అంతర్గత విచారణ కూడా చేపట్టినట్లు తెలిసింది. వీడియో వైరల్ కావటంతో దుర్గ గుడికి వచ్చే భక్తులు కూడా దీనిపై మండిపడుతున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన పోలీసులు.. ఇలా డ్యూటీ మరిచి పేకాట ఆడటం ఏమిటంటూ భక్తులు మండిపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.