శనివారం ఒకే విడతలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఆరోజే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు హరియాణా పీఠం హస్తం పార్టీదేనని పేర్కొన్నాయి. ఇక ఫలితాలు మంగళవారం వెలువడనుండగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం విజయవం తమదేననే సంతోషంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హరియాణాలో గెలుపొందితే ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక హరియాణా కాంగ్రెస్ పార్టీలో పలువురి పేర్లు సీఎం రేసులో ఉండగా.. వాళ్లు మాత్రం ఎవరికి వారు ధీమాగా తమదే ముఖ్యమంత్రి పీఠం అని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో హరియాణా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ హరియాణాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. సీఎం అభ్యర్థి ఎవరు అని మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం చెప్పిన భూపిందర్ సింగ్ హుడా.. ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని పార్టీ హైకమాండే నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. ఇలాంటి కల్పిత ప్రశ్నలకు సమాధానాలను చెప్పలేమని సున్నితంగా చెప్పేశారు.
అయితే అంతటితో ఆగని మీడియా.. కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా లాంటి వారు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు కదా అని అడిగింది. అందుకు బదులిచ్చిన భూపిందర్ సింగ్ హుడా.. ఇది ప్రజాస్వామ్యం అని.. ప్రతీ ఒక్కరు ముఖ్యమంత్రి కుర్చీని ఆశించవచ్చని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా మీరు కూడా ఆ పదవిని కోరుకోవచ్చని.. అయితే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీఎం ఎవరు అనే దానిపై నిర్ణయం తీసుకుంటుందని సమాధానం చెప్పారు.
మరోవైపు.. హరియాణాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా వివరణ ఇచ్చారు. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతుందని తెలిపారు. మొదట కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలను నిర్వహిస్తామని.. వాటిలో తీసుకునే నిర్ణయాలను హైకమాండ్‌కు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత సీఎల్పీతో అధిష్ఠానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.