మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీని కేసులు వీడటం లేదు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు కీలక నేతలు కేసులు ఎదుర్కొంటుండగా.. తాజాగా మరో రాజ్యసభ ఎంపీ కూడా ఈడీ కేసులో ఇరుక్కున్నారు. మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు.. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాపై ఈ దాడులు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆప్ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. భూ అక్రమాల వ్యవహారానికి సంబంధించి దాఖలైన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. పంజాబ్‌లోని లూథియానాలోని సంజీవ్ అరోరా ఎంపీ నివాసం, ఆఫీస్‌తో పాటు ఆయనకు సంబంధించిన దగ్గరి వ్యక్తుల నివాసాలలోనూ ఈడీ అధికారులు తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఇక తనపై జరుగుతున్న ఈడీ దాడులపై ఎంపీ సంజీవ్ అరోరా ట్విటర్ వేదికగా స్పందించారు. ఈడీ అధికారులు సోదాలు చేయడానికి గల కారణాలు ఏంటో తనకు తెలియదని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని.. అందుకే దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని తేల్చి చెప్పారు.
ఈ ఈడీ దాడులపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని.. అయితే ఆప్ నేతలను ఎవరూ ఆపలేరని.. కొనలేరని.. భయపెట్టలేరని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఇప్పటికే పలువురు ఆప్ నేతలు ఈడీ, సీబీఐ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరు జైలుకు కూడా వెళ్లి.. ప్రస్తుతం బెయిల్‌పై బయటికి వచ్చారు.
మరోవైపు.. ఈ వ్యవహారంపై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. దేవుడు ఆమ్ ఆద్మీ పార్టీ వెంట ఉన్నాడని.. ఏ తప్పు చేయనపుడు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణల దర్యాప్తు పేరుతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీని కేంద్ర దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. గతంలో ఇలాంటి దాడులు చేసిన తర్వాతే తనను, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ సహా పలువురిని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.