ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ సదస్సులో పాల్గొన్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అమెరికా ఎన్నికలు, ఐక్యరాజ్యసమితి పనితీరు సహా పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్కెట్‌లో మనుగడలేని ఓ పాత వ్యాపార సంస్థలా ఐరాస మారిందని అభిప్రాయపడ్డారు. రెండు యుద్ధాలు జరుగుతుంటే (ఉక్రెయిన్-రష్యా, గాజా-ఇజ్రాయేల్ ఘర్షణ) అది ప్రేక్షక పాత్రకే పరిమితమైందని వ్యాఖ్యానించారు. సంక్షోభాలను పరిష్కరించేందుకు ఐరాస ఏమీ చేయలేకపోతోందని తెలిపారు. భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను పెంచడం సహా ఐరాసను సంస్కరించాలని గత కొన్నేళ్లుగా భారత్ డిమాండ్ చేస్తోందని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరగడంలేదని, వ్యాపార ప్రపంచంలో స్టార్టప్‌ల మాదిరిగా ఐరాస కూడా ముందుకు సాగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై మాట్లాడుతూ.. ‘వాస్తవానికి అమెరికా భౌగోళికంగా దాని ఆర్థిక దృక్పథంలో మార్పు తీసుకొచ్చింది.. నవంబర్‌లో జరిగే ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాబోయే రోజుల్లో ఈ పోకడలు చాలా తీవ్రమవుతాయి.’ అని అన్నారు. ఇక, శ్రీలంక వంటి పొరుగు దేశాలు సహా ఇతరులకు సహాయం చేయడానికి భారత్ తీసుకున్న కొన్ని చర్యలను వివరించారు.
అలాగే, షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం కోసం త్వరలో పాకిస్థాన్‌లో జైశంకర్ పర్యటించనున్నారు. దీని గురించి ప్రశ్నించగా.. ‘నేను ఒక నిర్దిష్ట పని, ఒక నిర్దిష్ట బాధ్యత కోసం అక్కడికి వెళుతున్నాను. నేను నా బాధ్యతలను సీరియస్‌గా తీసుకుంటాను. కాబట్టి, SCO సమావేశంలో భారత్‌కు ప్రతినిధిగా కి నేను అక్కడికి వెళ్తున్నాను, అదే నేను చేయబోతున్నాను’ అని జైశంకర్ చెప్పారు. .
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో ఏఐ అనేది కీలకమైన అంశం. అణ్వాయుధాల్లానే ప్రస్తుతం ఇది కూడా చాలా ప్రమాదకరం. దీన్నుంచి సంభవించే పరిణామాలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలూ సిద్ధంగా ఉండాలి’ అని అన్నారు. రానున్న కాలంలో ఏఐ ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొన్నారు. ప్రపంచీకరణ గురించి మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో ప్రపంచీకరణ అనేది ఆయుధంగా మారొచ్చని, దీనిపట్ల ప్రపంచ దేశాలు జాగ్రత్తగా ఉండాలన్నారు.