పెళ్లిచేసుకుంటానని మోసం చేయడమే కాకుండా.. ప్రియుడు బెదిరింపులకు పాల్పడటంతో అతడికి గుణపాఠం చెప్పాలని ఆమె నిర్ణయించకుంది. దీంతో మాట్లాడాలని ఉందని అతడ్ని ఓ చోటుకు రప్పించి, మాటల్లో దింపింది. కొద్దిసేపటి తర్వాత తన వెంట తెచ్చుకున్న ఓ బాటిల్ బ్యాగులో నుంచి బయటకు తీసి.. మూత తెరిచి అందులోని రసాయనాన్ని అతడిపై కుమ్మరించింది. ఆమె ఏం చేస్తుందో తెలియక అయోమయోనికి గురైన అతడు.. తన ఒంటిపై పడింది యాసిడ్ అని తర్వాత గ్రహించాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్ర గాయాలైన అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. విస్మయానికి గురిచేసే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది.
యాసిడ్ పోసిన యువతి మాట్లాడుతూ.. ‘నన్ను బ్లాక్‌మెయిల్ చేశాడు..డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు అందుకే అతడిపై యాసిడ్ పోశాను.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసగించాడు.. మరొకర్ని పెళ్లాడాడు.. నన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడు కానీ బెదిరింపులకు పాల్పడ్డాడు’ అని ఆమె ఆరోపించింది. యాసిడ్ దాడికి గురైన యువకుడ్ని వివేక్‌గా గుర్తించారు. దాడిచేసిన యువతి వర్ష, వివేక్ 12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, పెళ్లిచేసుకోవాలని భావించారని పోలీసులు తెలిపారు. అయితే, అతడు మరో అమ్మాయిని వివాహం చేసుకోవడంతో యువతి రగిలిపోయింది. అతడ్ని పథకం ప్రకారం రెస్టారెంట్‌కు రప్పించి, యాసిడ్ పోసిందని చెప్పారు.
ఆమె యాసిడ్ పోసిన తర్వాత గాయాలకు విలవిలలాడిపోయిన యువకుడు.. తన ఒంటిపై షర్టును విప్పుతూ. రెస్టారెంట్ నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు కూడా గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రెస్టారెంట్ మేనేజర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ.. ‘మేము అప్పుడే రెస్టారెంట్ తెరిచాం.. దాడిచేసిన యువతీ వచ్చినప్పటికీ ఇంకా శుభ్రం చేస్తున్నారు.. దీంతో బయట కూర్చున్న ఆమె కొద్దిసేపటి తర్వాత లోపలికి వచ్చింది.. కాసేటికే యువకుడు వచ్చాడు.. దోశ, చోలే భటూరే ఆర్డర్ చేశారు.. వాళ్లు టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుతుంటే.. నేను బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళ్లాను.. ఇంతలోనే ఆ వ్యక్తి వచ్చి ఏం జరుగుతుందో చూడండి.. నాకేమీ అర్ధం కావడం లేదు అన్నాడు.. ఆ మహిళ నేను యాసిడ్ పోశాను అని చెప్పింది..’ అని అన్నాడు.
‘నన్ను కొన్నేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు... అందుకే అతడిపై యాసిడ్ పోశాను’ అని చెప్పిందన్నాడు. ఈ ఘటనలో ఆ మహిళకు కూడా గాయాలయ్యయాని, ఆమెకు చికిత్స చేయిస్తున్నామని అలీగఢ్ ఏసీపీ మయాంక్ పాఠక్ తెలిపారు. ‘ఇద్దరికీ పరిచయం ఉంది.. వారికి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి.. దాడి తర్వాత అతడు పారిపోయాడు.. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆ మహిళ చేసిన ఆరోపణలపై మాట్లాడటం తొందరపాటు అవుతుంది.. దర్యాప్తు కొనసాగుతోంది.. అతడ్ని గుర్తించే పనిలో ఉన్నాం’ అని పేర్కొన్నారు.