భారత్‌లో తొలిసారి ద్వైపాక్షిక పర్యటన కోసం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ కూడా ఉన్నారు. గతేడాది మాల్దీవుల ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడు అయిన తర్వాత ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి, అయినా ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన. నాలుగు నెలల కిందట జూన్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడు హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ముయిజ్జు సమావేశమవుతారు. భారత్, మాల్లీవుల సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇరువురి మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరు దేశాలకు ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ముంబయి, బెంగళూరు నగరాల్లో జరిగే కార్యక్రమాలకు ముయిజ్జు హాజరవుతారు. హిందూ మహాసముద్రంలో మాల్దీవులు భారత్‌కు కీలకమైన పొరుగు దేశం. ప్రధాని మోదీ దృక్పథమైన ‘సాగర్’ (ప్రాంతీయంగా అందరికీ భద్రత, అభివృద్ధి) విధానంలో దీనికి ప్రత్యేస్థానం ఉంది’ అని పేర్కొంది.
కాగా, భారత్ విషయంలో ముయిజ్జు వైఖరిలో మార్పు విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా, టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్ భద్రతకు భంగం కలిగించే పనులను మాల్దీవులు ఎన్నటికీ చేయదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడైన తర్వాత మాల్దీవుల నుంచి భారత బలగాలను ముయిజ్జు వెళ్లగొట్టిన విషయం తెలిసిందే. హిందూ మహాసముద్రంలో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి అయిన మాల్దీవులు.. చైనాతో సంబంధాలను పెంచుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో మయిజ్జు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకొన్నప్పటికీ.. ఆ చర్యలు ఈ ప్రాంతం భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించకుండా చూడటానికి కట్టుబడి ఉందని ముయిజు స్పష్టం చేశారు. ‘భారత్ మాకు (మాల్దీవులు) విలువైన భాగస్వామి, స్నేహితుడు.. పరస్పర గౌరవం, ప్రయోజనాలపై సంబంధాలను నిర్మించుకుంటాం.. భారత్‌తో మాల్దీవులకు బలమైన, వ్యూహాత్మక సంబంధాలు కొనసాగుతాయి.. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయి’ అని ఆయన చెప్పారు. దేశానికి మొదటి ప్రాధాన్యత తమ విధానమని, భారత్‌తో దీర్ఘకాల, విశ్వసనీయ సంబంధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంటుందని. అన్నారు.
‘ఇతర దేశాలతో మా సంబంధాలు భారతదేశ భద్రతా ప్రయోజనాలను దెబ్బతీయవని మేం విశ్వసిస్తున్నాం.. బలమైన, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తాం’ అని ఆయన అన్నారు. ‘మాల్దీవులు, భారత్‌లు ప్రస్తుతం పరస్పర ఆందోళనల గురించి బాగా అర్థం చేసుకున్నాయి.. వాటి మధ్య రక్షణ సహకారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుంద’ అని వ్యాఖ్యానించారు. భార్ దళాల మాల్దీవుల నుంచి పంపడం మాత్రం స్థానిక ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన సమర్థించారు. ఇటీవలి పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలలో సానుకూల పథాన్ని ప్రతిబింబిస్తున్నాయని, సహకార, పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మేము కట్టుబడి ఉన్నామని నా పర్యటన ముగిసే నాటికి స్పష్టమవుతుందని ముయిజు చెప్పారు.