హర్యానాలోనూ ఓట్ కౌంటింగ్ ఫలితాలను ఈసీ సరిగా అప్‌డేట్ చేయడం లేదని కాంగ్రెస్ నేత, ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. తప్పుడు ట్రెండ్స్ ఇవ్వాలని ఈసీపై కేంద్రంలోని బీజేపీ ఒత్తిడి పెంచుతోందని అనుమానం వ్యక్తం చేశారు.మంగళవారం హర్యానా,జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 'దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. 12, 13 రౌండ్ల లెక్కింపు పూర్తయినా ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్లో కేవలం 4, 5 రౌండ్ల ఫలితాలు మాత్రమే చూపిస్తున్నారు.కనీసం 8 సీట్లలో 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిందని, ఆ సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నా ఈసీ వాటిని చూపెట్టడం లేదు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాగే జరిగింది. అప్పుడు నేను, అభిషేక్ సింఘ్వి ఈసీఐకి ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకున్నారు. తాము ఈసీని రాజ్యాంగబద్ధమైన పక్షపాతం లేని సంస్థగా భావిస్తున్నాం.కానీ, అధికార యంత్రాంగంపై బీజేపీ ఒత్తిడి చేయడం సరికాదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ ఫలితాలు చూసి కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, సాయంత్రం 3 గంటల వరకు కౌంటింగ్ సెంటర్ వద్దే ఉండాలని, ఇదంతా మైండ్ గేమ్ అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.