ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రతన్ టాటా ఫ్రెండ్ మన తెలుగువాడే.. ఎవరీ 31 ఏళ్ల శంతను నాయుడు?

national |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 08:43 PM

దివికేగిన దిగ్గజ బిజినెస్‌మెన్ రతన్ టాటా గురించి మనం ఇప్పటికే ఎన్నోసార్లు, ఎన్నో విషయాలు వినడం, తెలుసుకోవడం చేస్తూనే ఉన్నాం. అయితే రతన్ టాటా తన దశాబ్దాల వ్యాపార జీవితంలో ఎంతో మందితో స్నేహం, మరెంతో మంది తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులతో సన్నిహితంగా ఉండటం, వారి పట్ల గౌరవం, అభిమానం చూపడం తెలిసిన విషయమే. అయితే రతన్ టాటాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు తెలుగువాడే కావడం విశేషం. ఇక రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్, సహాయకుడు, సన్నిహితుడు శంతను నాయుడు. అయితే 86 ఏళ్ల రతన్ టాటా, 31 ఏళ్ల శంతను నాయుడు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు. వారి మధ్య సంబంధం ఎలా ఉండేది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


సామాజిక కార్యకర్తగా, జంతు ప్రేమికుడిగా, రచయితగా, యువ పారిశ్రామికవేత్తగా సమాజంలో మార్పు తీసుకురావడానికి శంతను నాయుడు కృషి చేశారు. ఇక ఇవన్నీ గుణగణాలే శంతను నాయుడు.. రతన్ టాటాకు అత్యంత సన్నిహిత వ్యక్తిగా మారారు. మహారాష్ట్రలోని పూణేలో 1993లో పుట్టిన శంతను నాయుడు తల్లిదండ్రులు మాత్రం తెలుగు వారు కావడం గమనార్హం. ప్రస్తుతం 31 ఏళ్ల వయసు ఉన్న శంతను నాయుడు.. బిజినెస్‌ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. జంతు ప్రేమికుడైన శంతను నాయుడు, సామాజిక సేవ కోసం మోటోపౌస్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ వీధి కుక్కలకు సహాయం చేస్తూ ఉంటుంది.


శంతను నాయుడు సంస్థ మోటోపాజ్ రోడ్డుపై తిరిగే కుక్కల కోసం ప్రత్యేక డెనిమ్ కాలర్‌లను తయారు చేసింది. వాటిపై రిఫ్లెక్టర్లు ఉన్నాయి. రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాల నుంచి కుక్కలను రక్షించవచ్చు. ఇదే శంతను నాయుడుపై రతన్ టాటా దృష్టి పడేలా చేసింది. దీంతో శంతను నాయుడిని ముంబైకి పిలిచిన రతన్ టాటా.. అప్పటి నుంచి వారిద్దరి స్నేహం ప్రారంభమైంది. ఇద్దరి మధ్య ఆలోచనలు, సామాజిక సమస్యలపై ఉన్న స్పృహ వారి మధ్య స్నేహాన్ని మరింత దగ్గర చేసింది. ప్రస్తుతం శంతను నాయుడు.. రతన్ టాటా కార్యాలయంలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొత్త స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడంపై టాటా గ్రూప్‌కు శంతను నాయుడు సలహాలు ఇస్తుంటాడు.


సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన శంతను నాయుడు.. ఆ తర్వాత 2016లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. అతను కార్నెల్‌ యూనివర్సిటీలో ఆయన చేసిన హెమ్టర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డు, జాన్సన్ లీడర్‌షిప్ కేస్ కాంపిటీషన్ వంటి అనేక అవార్డులు వచ్చాయి. అయితే శంతను నాయుడు జీతం గురించి తెలియనప్పటికీ.. నికర విలువ రూ.5 నుంచి రూ.6 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇక శంతను నాయుడు ప్రతి ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ “ఆన్ యువర్ స్పార్క్స్(On Your Sparks)”లో లైవ్ సెషన్స్ చేస్తూ ఉంటాడు. స్టూడెంట్స్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి బోధిస్తాడు. దీని కోసం అతను ప్రతి పార్టిసిపెంట్ నుంచి రూ. 500 వసూలు చేసి.. ఆ డబ్బులను తన ఎన్జీఓ సంస్థ మోటోపాజ్ ఖర్చు చేస్తాడు.


శంతను నాయుడు గుడ్‌ఫెలో అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇది వృద్ధులను యువతతో అనుసంధానించే ఒక వేదిక. ఈ యాప్ ఉద్దేశం వృద్ధులకు వారి రోజువారీ పనులైన కిరాణా సామాను కొనడం, మెడిసిన్ అందించడం, డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌లో సహాయం అందించడం వంటివి ఉన్నాయి. దీనివల్ల ఒకవైపు వృద్ధులకు సహాయం చేయడంతోపాటు యువతకు జీవిత అనుభవాలను నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఇక రతన్ టాటాతో తనకు ఉన్న స్నేహం గురించి శంతను నాయుడు.. “ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్" అనే బుక్‌లో వివరంగా వెల్లడించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com