బిజినెస్ టైకూన్ రతన్ టాటాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ2 సర్కార్ 2008లో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది. అయితే దేశ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారతరత్న అవార్డును రతన్ టాటాకు ఇవ్వాలని ఆ తర్వాత దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపించాయి. దేశానికి ఆయన చేసిన సేవలు, దేశ అభివృద్ధి కోసం టాటా గ్రూప్ చేసిన ఎన్నో కార్యక్రమాలకు గుర్తుగా ఆయనకు భారతరత్న ఇవ్వడమే సరైంది అని ఎంతోమంది బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటా.. ఇలాంటి ఆడంబరాలను ప్రోత్సహించేవారు కాదు. ఇక తనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తిన వేళ.. ఒక సందర్భంలో దానిపై ఆయన స్పందించారు.
అయితే 2008లో పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిన తర్వాత రతన్ టాటాకు భారతరత్న ఇస్తే బాగుండేదని ప్రముఖులే కాకుండా సోషల్ మీడియాలో పెద్దఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే రతన్ టాటా మాత్రం అలాంటివాటిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. ధనిక కుటుంబంలో పుట్టినా రతన్ టాటా.. తన జీవితాంతం సామాన్యుడిగానే జీవించిన గొప్ప వ్యక్తి. ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన బిజినెస్‌మెన్‌లలో ఒకరైన రతన్ టాటా.. ఎప్పుడూ కూడా సంపన్నులు, కుబేరులతో కలిసి కనిపించకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇక తనకు పదవులు, పురస్కారాలు, అవార్జుల కంటే దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని రతన్ టాటా నమ్మేవైరు.
ఈ నేపథ్యంలోనే తనకు భారతరత్న ఇవ్వాలని జరిగిన ప్రచారంపై 3 ఏళ్ల క్రితం ఆయన స్పందించారు. ఇలాంటి డిమాండ్లు, ప్రచారం వెంటనే ఆపేయాలని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన రతన్ టాటా.. భారతీయుడిగా పుట్టడమే తాను చేసుకున్న అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. దేశ అభివృద్ధిలో, దేశ సంపద పెరగడంలో తన వంతు సహకారం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. దీంతో 3 ఏళ్ల క్రితం రతన్ టాటా చేసిన పోస్ట్.. ప్రస్తుతం ఆయన మరణించిన తర్వాత మళ్లీ వైరల్ అవుతోంది.
తనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు చేస్తున్న డిమాండ్లను తాను గౌరవిస్తున్నట్లు చెప్పిన రతన్ టాటా.. అయితే దయచేసి అలాంటి ప్రచారాన్ని ఆపేయాలని వాళ్లందరినీ కోరుతున్నట్లు గతంలో ట్వీట్ చేశారు. దేశానికి రతన్ టాటా అందించిన సేవలను ప్రశంసిస్తూ, యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొంటూ.. భారతరత్న ఫర్ రతన్ టాటా.. హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ట్వీట్లకు స్పందించిన రతన్ టాటా.. ఇలాంటివి ఆపేయాలని విజ్ఞప్తి చేశారు.