ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. నారా లోకేశ్ శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా, ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ సమావేశం కానున్నారు. ఏపీలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం... రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పురోగతికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో లోకేశ్ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా లోకేశ్ పర్యటన కొనసాగనుంది.