పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసిన వ్యవహారంలో చిలకలూరిపేట బ్యాంకు సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. ఖాతాదారుల ఎఫ్డీలు దారి మళ్లించడంలో ఉన్న పాత్ర, ఎంత మొత్తంలో నగదు దారి మళ్లించారనే విషయంపై ఆరా తీస్తున్నారు. మోసపోయిన ఖాతాదారులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అండగా నిలిచారు. బాధితులకు న్యాయం చేయాలని బ్యాంకు అధికారులను ఆయన కోరారు.బాధితులు రెండు నెలలుగా ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లి నిలదీశారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల బాండ్లు చెల్లవని.. అందులో నగదు, బంగారం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో హతాశులయ్యారు. మోసపోయామని గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఈ కేసును సీఐడీకి అప్పగించారు.