కర్ణాటక రాజధాని బెంగళూరులో సరికొత్త రకమైన దొంగతనాలు బయటపడ్డాయి. దాదాపు 50 ఇళ్లను ఒక్కడే వ్యక్తి దోచుకున్నాడు. పావురాలతో ఇలా ఆ దొంగ.. చోరీలకు పాల్పడుతున్నాడని తెలిసి పోలీసులో అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఆ దొంగను పట్టుకున్న పోలీసులు.. అతడి నుంచి రూ.30 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణలో పావురాల ద్వారా ఆ దొంగ చేసిన దొంగతనాలు విని పోలీసులు షాక్ అయ్యారు. ఇక తరచూ దొంగతనాలు చేసే ఆ దొంగ.. గతంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లి.. బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయినా దొంగతనాలు మానకుండా చేస్తూనే ఉంటూ తాజాగా దొరికిపోయాడు.
మంజునాథ్ అనే 38 ఏళ్ల దొంగను తాజాగా బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీలు చేయడంలో ఆరితేరిన మంజునాథ్.. పావురాలను తన దొంగతనాల కోసం ఉపయోగించేవాడు. పావురాలను పెంచుకునే మంజునాథ్ వాటితోనే చోరీలు చేసేవాడు. పావురాలకు ట్రైనింగ్ ఇచ్చి.. వాటి శరీరానికి చిన్న చిన్న కెమెరాలు, ట్రాన్స్‌మీటర్లు అమర్చి వాటితో ప్రాక్టీస్ చేయించాడు. ఇక ఆ పావురాలను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాటిని కాలనీల్లోకి వదిలేసేవాడు. అవి వెళ్లే రూట్‌ను కెమెరాల ద్వారా సెల్‌ఫోన్‌లో చూసేవాడు. పావురాల ద్వారా సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి.. ఎక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేరు.. తాళాలు వేసిన ఇళ్లను గుర్తించేవాడు.
హోసూర్‌కు చెందిన మంజునాథ్ బెంగళూరులోని నాగరత్‌పేటలో నివాసం ఉంటూ దొంగతనాలకు పాల్పడేవాడు. ఆ కాలనీ, ఇళ్లపై రెక్కీ నిర్వహించిన తర్వాత మంజునాథ్.. ఆ ఇళ్లపై పడి దోచుకునేవాడు. అయితే ఎవరికైనా దొరికిపోతే.. తాను పెంచుకుంటున్న పావురాలు.. తప్పిపోయి ఆ ఇంటికి వచ్చాయని వాటిని పట్టుకోవడానికి వచ్చానంటూ అబద్ధాలు చెప్పేవాడు. ఇలా దాదాపు 50 ఇళ్లల్లో చోరీలు చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. తాళం వేసిన ఇళ్లను పావురాలు గుర్తించిన తర్వాత ఇనుపరాడ్‌తో ఇంటి తాళాన్ని పగలగొట్టి అందులోకి దూరేవాడు. అనంతరం ఇంట్లో డబ్బు, బంగారం ఎక్కడ ఉందో కనిపెట్టి దొంగిలించేవాడు.
అయితే వరుసగా చోరీలు జరుగుతుండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బెంగళూరు సిటీ మార్కెట్ పోలీసులు రంగంలోకి దిగారు. గజదొంగ అయిన మంజునాథ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం బయటికి వచ్చింది. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి.. రూ.30 లక్షల విలువైన 475 గ్రాముల బంగారం, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.