ఫైరింగ్ ప్రాక్టీస్ సందర్భంగా షెల్ పేలి ఇద్దరు అగ్నివీరుల ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి ప్రమాదవశాత్తూ షెల్ పేలడంతో ఇద్దరు అగ్నివీరులు మరణించారని తెలిపారు. ప్రమాదంలో చనిపోయినవారిని విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21)గా గుర్తించారు. నాసిక్ రోడ్డులోని ఆర్టిలరీ సెంటర్‌లో అగ్నివీరుల బృందం ఫీల్డ్ గన్‌తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. షెల్స్‌లో ఒకటి పేలిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విశ్వరాజ్, సైఫత్‌లను దియోలలీలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతిచెందిన వైద్యులు ధ్రువీకరించారని అధికారులు తెలిపారు.
హవిల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తూ మరణాలుగా కేసు నమోదుచేశామని పోలీసులు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు. కాగా, గతవారం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మాక్‌డ్రిల్ సందర్భంగా జరిగిన పేలుడులో ఓ అగ్నవీర్ ప్రాణాలు కోల్పోయాడు. సేవార్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్‌పుర ఆర్మీ శిక్షణ కేంద్రంలో అక్టోబరు 4న మధ్యాహ్నం అగ్నివీరులు మాక్ డ్రిల్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సౌరభ్ పాల్ (24) అనే అగ్నివీరుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.
కాగా, త్రివిధ దళాల్లో సైనిక నియమాకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన యువత. దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అగ్నివీరులుగా ఎంపికైనవారు నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. వారిలో 25 శాతం మందిని మాత్రమే కొనసాగించి, శాశ్వత సర్వీసుల్లోకి తీసుకుంటారు. ప్రతిపక్షాలు సహా ఎన్డీయేలో కీలక భాగస్వామి జేడీయూ సైతం ‘అగ్నిపథ్’ను సమీక్షించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగేళ్ల తర్వాత 50 శాతం మంది అగ్నివీరులను సైన్యంలో కొనసాగించాలని, వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచాలని ఇటీవల సైన్యం సిఫార్సు చేసింది.
కాగా, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అమరవీరులైన అగ్నివీర్ సిబ్బంది కుటుంబాలకు పరిహారం విషయంలో బీజేపీపై పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించడం.. దీనికి ఇండియన్ ఆర్మీ అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్(ADGPI) స్పందించిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌లు చేసిన అత్యున్నత త్యాగానికి భారత సైన్యం సెల్యూట్ చేస్తోందని, వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించినట్లు సైన్యం తెలిపింది.