ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వాన గండం వెంటాడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తుంది. రెండు రోజుల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనిస్తుంది అంటున్నారు. ఈ అల్పపీడనం తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో నేటి నుంచి నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయంటున్నారు.
ఇవాళ కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వానలు పడతాయంటున్నారు. బుధవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అత్యంత భారీ వానలు కురుస్తాయంటున్నారు. గురువారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయంటున్నారు.
బుధవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతారవరణశాఖ అంచనా వేస్తోంది. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉంటుందని..మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉండటంతో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, స్తంభాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాతో పోలీసు, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. కంట్రోలు రూమ్, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేయాలని.. శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. అక్కడక్కడా గండ్లు పడే అవకాశం ఉందని.. కాలువలు, గట్లను గుర్తించి పర్యవేక్షించాలి అన్నారు. ప్రధానంగా ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకుండా చూడాలి అన్నారు.
సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురవగా.. మరోసారి ఇదే తరహాలో వానలు పడతాయంటున్నారు. వాయుగుండ, తుఫాన్ కారణంగా ఒక రోజులో కనీసం 15 నుంచి 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల విజయవాడలో పరిస్థితి పునరావృతం కాకుండా ఇప్పటినుంచే అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన చోట కాలువలు, వంకలు, వాగులు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో పరిశీలించి పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అంతేకాదు అక్టోబర్, నవంబర్ నెలల్లో తుఫాన్‌లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.