ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు పండగే.. నేడు మద్యం షాపుల లైసెన్సులకు సంబంధించి లాటరీ తీస్తారు. ఉదయం 8 గంటల నుంచే 26 జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లాల వారీ షాపుల్ని క్రమ పద్దతిలో లాటరీ తీస్తారు. జిల్లాలో ఎన్ని షాపుల్ని నోటిఫై చేశారో చూసి.. ముందుగా అందులో ఒకటో నంబరు షాపునకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో పరిశీలిస్తారు. అన్ని నంబర్లను డబ్బాలో వేసి.. వాటిలో నుంచి ఒకటి తీసి.. అందులో వచ్చిన నంబరు దరఖాస్తుదారుకు మద్యం షాపు లైసెన్సు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం దరఖాస్తుదారుల సమక్షంలోనే నిర్వహిస్తారు. ఆ తర్వాత వరుస క్రమంలో అన్ని షాపులకు లాటరీ తీస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఇవాళ లాటరీ తీసిన తర్వాత మద్యం షాపుల లైసెన్సులు ఎవరికి దక్కాయో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వారు లైసెన్స్ ఫీజు చెల్లించగానే షాపుల్ని కేటాయిస్తారు. ఈ నెల 15న షాపుల్ని కేటాయిస్తారు.. ఈ నెల 16 నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు మొదలుపెట్టొచ్చు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో.. నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నాణ్యమైన మద్యం క్వార్టర్ రూ.99కే అందిస్తామని.. అక్టోబర్ 16 నుంచి ఏపీవాసులకు అందుబాటులోకి తెస్తామని చెప్పింది. గతంలో ప్రభుత్వం చెప్పినట్లుగానే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించబోతోంది.
గత ఐదేళ్లు రాష్ట్రంలో మద్యం షాపులు ప్రభుత్వం నడిపింది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులకు గాను.. ఈ నెల 11 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 89,882 దరఖాస్తులు రాగా.. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల ఆదాయం సమకూరింది. వాస్తవానికి ప్రభుత్వం లక్ష వరకూ దరఖాస్తులు వస్తాయని.. రూ.2వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ పోటీ ఉండగా.. తిరుపతి, శ్రీసత్యసాయి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో తక్కువగా దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తుదారులు సిండికేట్ అయ్యారు. నలుగురైదుగురు నుంచి 10మంది వరకు కలిసి 20 దరఖాస్తులు సమర్పించారు. కొన్ని జిల్లాల్లో నేతలు తమ అనుచరులను రెండు మూడు గ్రూపులుగా విభజించి ఆయా షాపులకు దరఖాస్తులు చేయించారు. ఇలా సిండికేట్‌గా మారి ఎవరికి డ్రాలో మద్యం షాపు దక్కినా వాటా ఇచ్చేటట్లు.. లేకపోతే కొంత డబ్బు ఇచ్చేలా డీల్ చేసుకున్నారు. ఈసారి మహిళలు కూడా మద్యం షాపుల కోసం దరఖాస్తులు ఇవ్వడం విశేషం. పాత మద్యం వ్యాపారులు కూడా సిండికేట్ అయ్యారు.